Eatala Rajendar: ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోంది- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.

Eatala Rajendar: ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోంది- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Updated On : May 29, 2025 / 11:43 PM IST

Eatala Rajendar: బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా స్ట్రీట్ ఫైట్ చేయదని ఆయన చెప్పారు. బీజేపీ ఏనాడూ నీచ రాజకీయాలు చేయదన్నారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆరేనని ఈటల ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు గత పదేళ్లు కేసీఆర్ ను నమ్మి మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్ ను నమ్మి మరోసారి మోసపోయారని ఆయన వాపోయారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలవెలబోతోందని విమర్శించారు ఈటల రాజేందర్. అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారాయన.

బీజేపీతో.. బీఆర్ఎస్ విలీనం అనే గాలి వార్తలకు నేను సమాధానం చెప్పను అని ఈటల అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణవాదులను కలవడం నేరం కాదన్న ఈటల.. నాయకులు వారి కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం నేరం అన్నారు. ఇవన్నీ నేర్పించింది కేసీఆర్ కాదా అని ఆయన నిలదీశారు.

Also Read: బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారా? కొత్త పార్టీ పెడతారా? అసలు కవిత స్ట్రాటజీ ఏంటి..

నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అని, దాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతాను, అది తన సంస్కారం అని ఈటల పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా తాను హాజరవుతానని ఈటల తెలిపారు.