రూ.4 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించి.. ఆ తర్వాత అన్నను చంపేసిన తమ్ముడు.. ప్లాన్ బయటపడిందిలా..

డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే తన అన్న వెంకటేశ్‌ చనిపోయాడని పోలీసులకు నరేశ్ చెప్పాడు.

రూ.4 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించి.. ఆ తర్వాత అన్నను చంపేసిన తమ్ముడు.. ప్లాన్ బయటపడిందిలా..

Updated On : December 3, 2025 / 1:10 PM IST

Karimnagar: కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మామిడి నరేశ్‌ అనే వ్యక్తి బీమా డబ్బులు వస్తాయని తన అన్నను చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, బీమా డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

నరేశ్ అప్పు చేసి రెండు టిప్పర్‌లు కొని, వాటిని రెంట్‌కి ఇస్తూ సంపాదిస్తున్నాడు. అయితే, ఈ వ్యాపారం కొన్నాళ్లుగా సరిగ్గా సాగడం లేదు. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాడు. పలువురి దగ్గర అప్పులు చేయడమే కాకుండా, షేర్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టి నష్టపోయాడు.

అతడు మొత్తం రూ.1.50 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. అప్పులవారి గోల పెరిగిపోవడంతో తన అన్న మామిడి వెంకటేశ్‌ (37)ను హత్య చేయాలని ప్లాన్‌ వేశాడు. వెకంటేశ్‌కు పెళ్లికాలేదు.. అలాగే, మానసిక సమస్యలూ ఉన్నాయి. రెండు నెలల క్రితం నుంచి వెంకటేశ్‌ పేరుపై అతడు 4 పలు ఇన్సురెన్స్‌ కంపెనీల నుంచి మొత్తం కలిపి రూ.4.14 కోట్ల బీమా పాలసీలు తీసుకున్నాడు.

ఇటీవల ఎన్‌.రాకేశ్‌ అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన రూ.7 లక్షలు వెంటనే ఇవ్వాలని నరేశ్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో తన సోదరుడు వెంకటేశ్‌ను తాను చంపేయాలనుకుంటున్నానని, తనకు సహకరిస్తే మొత్తం కలిపి రూ.20లక్షలు ఇస్తానని రాకేశ్‌కు ఆశ చూపించాడు.

Also Read: EV స్కూటర్ కొనాలనుకుంటున్నారా? నవంబర్ లో సేల్స్ అదుర్స్.. టాప్ సెల్లింగ్ స్కూటర్ ఇదే..

వెంకటేశ్‌ను చంపాక వచ్చిన బీమా డబ్బులో నుంచి ఇస్తానని తెలిపాడు. వెంకటేశ్‌ను టిప్పర్‌తో ఢీకొట్టి చంపి బీమా డబ్బులు తీసుకోవాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం డ్రైవర్‌ ప్రదీప్‌ను కూడా వారు ఒప్పించారు. ప్లాన్‌ వేసుకుంటున్న సమయంలో ముగ్గురూ కనిపించే విధంగా ఓ వీడియోను రికార్డు చేసుకున్నారు. నవంబరు 29న రాత్రి 11 గంటలకు ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద రహదారిపై టిప్పర్‌ ఆగిపోయిందంటూ నరేశ్‌కు డ్రైవర్‌ ఫోన్‌ చేసి తెలిపాడు.

తన అల్లుడు సాయి బైక్‌పై తన సోదరుడు వెంకటేశ్‌ను ఎక్కించిన నరేశ్‌.. వారిని టిప్పర్‌ వద్దకు పంపాడు. వారి వెనకే నరేశ్‌ వెళ్లాడు. టిప్పర్‌ వీల్‌ కింద జాకీ పెట్టాలంటూ వెంకటేశ్‌ను నరేశ్‌ దాని కింద పడుకోబెట్టాడు. ఆ తర్వాత టిప్పర్‌ను నరేశ్ ముందుకుపోనిచ్చాడు.

టైర్ల కింద వెంకటేశ్‌ మృతి చెందాడు. డ్రైవర్‌ ప్రదీప్‌ను అక్కడి నుంచి పారిపోవాలని నరేశ్‌ చెప్పాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే తన అన్న వెంకటేశ్‌ చనిపోయాడని పోలీసులకు నరేశ్ చెప్పాడు. అయితే ఇన్సురెన్స్ కంపెనీ సిబ్బందికి నరేశ్‌ చెప్పిన వివరాలపై అనుమానం వచ్చింది.

దీంతో పోలీసులకు ఇన్సురెన్స్ కంపెనీ సిబ్బంది ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు దీనిపై విచారణ జరిపి వెంకటేశ్‌ను చంపింది నరేశేనని గుర్తించారు. ఇన్సురెన్స్‌ డబ్బు కోసమే తాను ఈ హత్య చేసినట్లు పోలీసుల ముందు నరేశ్‌ ఒప్పుకున్నాడు.