కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ సీటులో పోటీపై బీఆర్ఎస్ డైలమా?

వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఓటమి బీఆర్ఎస్‌ను ఆలోచనలో పడేసిందంటున్నారు.

కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ సీటులో పోటీపై బీఆర్ఎస్ డైలమా?

KCR

Updated On : November 7, 2024 / 9:24 PM IST

ఓటర్ల నమోదు గడువు ముగిసింది. వచ్చే మార్చిలోనే ఎన్నికలున్నాయ్. అన్ని పార్టీలు..చివరకు ఇండిపెండెంట్‌లు కూడా హడావుడి చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆ సీటులో విజయ దుందిభి మోగించిన పార్టీ మాత్రం సైలెంట్‌గా ఉంటోంది. పోటీ చేయాలా వద్దా అంటూ లెక్కలు వేసుకుంటోంది.

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ సీటులో పోటీపై డైలమాలో ఉంది గులాబీ పార్టీ. ఈ సీటులో గతంలో సత్తా చాటిన బీఆర్ఎస్..ఇప్పుడు పోటీ చేయాలంటేనే ఆలోచిస్తుంది. మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలున్నా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోకపోవడం గులాబీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీకాలం మార్చిలో ముగియనుంది. దాంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికపై రాజకీయ పార్టీల కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టాయి. ఓటరు నమోదు ప్రక్రియ కూడా ముగిసిపోయింది.

ఈ సీటులో పోటీ చేస్తుందా?
అయినా బీఆర్ఎస్ పార్టీ ఈ సీటులో పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతలు అంతో ఇంతో కొత్త ఓటర్లను నమోదు చేయించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు గులాబీ పార్టీలో నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, టీఎన్జీవో నేత దేవీప్రసాద్, టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ చిరుమళ్ళ రాకేశ్‌, డాక్టర్ బీఆర్ రావు ఆసక్తిగా ఉన్నారు.

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారికంగా పోటీ చేయలేదు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ఎన్నికలకు పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇంకా ఎటూ తేలడం లేదు. మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు, పార్టీ కీలక నేతలు మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జోగినపల్లి సంతోశ్‌లు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోకే వస్తారు.

పోటీ చేస్తే కలసి వస్తుందని కూడా భావిస్తున్నారా?
గులాబీ పార్టీలో కీలక నేతలంతా ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్‌ పరిధి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ..ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అని గులాబీ నేతల్లో చర్చ జరుగుతుందంట. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో పట్టభద్రుల మద్దతు ఉండదని పోటీ చేయలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగులు, పట్టభద్రులు అసంతృప్తితో ఉన్నారని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే పోటీ చేస్తే కలసి వస్తుందని భావిస్తున్నారు.

ఎన్నికలు జరిగే నాటికి కాంగ్రెస్ సర్కార్‌ ఏర్పడి ఏడాది గడిచిపోతుందని.. అప్పుడు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని అంచనా వేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయాన్ని పలువురు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా..మండలి ఎన్నికల్లో పోటీ చేస్తే నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంటుందంటున్నారు కొందరు నేతలు. రాజకీయంగా హైదరాబాద్ తర్వాత అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఈ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో విజయం సాధించిన అంశాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఓటమి బీఆర్ఎస్‌ను ఆలోచనలో పడేసిందంటున్నారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ వస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న డైలమాలో ఉందట. అందుకే కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటులో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతుందట. పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసి సహకరిస్తే తప్ప పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర ఈ అంశంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నా గులాబీ దళపతి తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదని తెలుస్తోంది.

Vizianagaram MLC election: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్