కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే.. చంద్రబాబు నీళ్లు ఎత్తుకెళ్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే.. చంద్రబాబు నీళ్లు ఎత్తుకెళ్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha

Updated On : June 4, 2025 / 12:17 PM IST

BRS MLC Kavitha: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇచ్చిందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని కవిత అన్నారు. నీళ్లు ఇవ్వటం కేసీఆర్ చేసిన తప్పా..? అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం కమీషన్ కాంగ్రెస్ కమీషన్ అంటూ విమర్శించారు. కేసీఆర్‌ది గట్టి గుండె కాబట్టి కాళేశ్వరం కట్టారు. తెలంగాణ యోధుడు కేసీఆర్. కాంగ్రెస్ నేతలు కలలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టలేరని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జలయజ్ఙాన్ని ధనయజ్ఞం చేసింది. కేసీఆర్ కు పేరు రావొద్దని కుట్ర చేస్తూ కమిషన్ వేశారని కవిత ఆరోపించారు.

నీ గురువు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్లు ఎత్తుకు వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రి అడ్డుకోవాలి.. అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని కవిత డిమాండ్ చేశారు. చంద్రబాబు మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అందుకే తెలంగాణ ఎంపీలు మాట్లాడటం లేదు. కనీసం ఈటల రాజేందర్ కూడా మాట్లాడటం లేదు. రాజేందర్ నోరు మూసుకొని అపవాదు తెచ్చుకోవద్దు అంటూ కవిత సూచించారు.

ముఖ్యమంత్రి ఉత్తరం రాయకుండా ఉన్నా.. బీజేపీ స్పందించకపోయినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాగృతి తరపున ఉద్యమం చేస్తామని కవిత హెచ్చరించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే.. కేసీఆర్ మీద ఈగ కూడా వాలనివ్వం అని కవిత పేర్కొన్నారు. మా నాయకులను బైండోవర్ కావాలని పోలీసులు ఫోర్స్ చేస్తున్నారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న వాళ్లు ఎందుకు భయపడుతున్నారు..? ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతామని భయపడుతున్నారా..? మీరు అడ్డుకుంటే జిల్లాజిల్లాకు పోతామని కవిత అన్నారు.