పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. ఆ నినాదంతో జనంలోకి
ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్.

BRS
Parliament Elections 2024 : తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికలకు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. మనమే తెలంగాణ గళం.. మనమే తెలంగాణ దళం.. మనమే తెలంగాణ బలం అన్న నినాదాన్ని అందుకుంది. ఈ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది గుళాబీ దళం. ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్..
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్‌ఎస్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Also Read : తెలంగాణ బరిలో ప్రధాని మోదీ, సోనియా? జాతీయ రాజకీయాలకు వేదికగా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ అన్న నినాదంతో ప్రజల్లోకి..
ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అత్యంత ప్రాధాన్యనతనిస్తున్నారు. పార్టీ ఓడిపోవడానికి క్షేత్రస్థాయిలో కారణమైన పరిస్థితులపై అన్ని వివరాలు సేకరించారు. ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్. తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు.
కార్యకర్తలకు కీలక సూచనలు..
బుధవారం ఆదిలాబాద్, గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశమైన కేటీఆర్.. పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై పుస్తకాన్ని ముద్రించి అందజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల అనంతరం నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు కేటీఆర్.
Also Read : ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్!
వరుస సమీక్షలతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న పార్టీ అధిష్టానం.. ఈ సమీక్ష సమావేశాల్లో నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.