BRS situation: విపక్ష పాత్రకు దూరంగా బీఆర్‌ఎస్ నేతలు!
ఎన్నికల్లో ఓటమిపై చాలా నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదంటే..

Harish Rao, KTR
రాజకీయాలంటే నిత్యం హంగామా… క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తుంటారు నేతలు. తమ పని లేకున్నా.. తమతో పనిలేకున్నా ఖాళీగా కూర్చోవడమంటే పొలిటీషియన్స్‌కు అసలు కుదరదు. ఏదో పని ఉండాలే.. ఇలా సుమారు ఇరవయ్యేళ్లు బిజీ బిజీగా గడిపిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేం ఉన్నాదన్నట్లు ప్రధానమైన నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట.. అధినేత కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ నేతలు బయటకి ఎందుకు రావడం లేదు. బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది….?
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పనిలేకుండా పోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్‌ఎస్ నేతలు ఆ పనిచేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా… నూటికి 90 శాతం మంది బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
హడావుడి చేస్తున్న నేతలు.. ఆ తర్వాత మాత్రం..
ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనల్లో హడావుడి చేస్తున్న నేతలు ఆ తర్వాత క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీని నడిపే విషయంలో హైకమాండ్ నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంతోనే బీఆర్‌ఎస్ నేతలు ఇలా ఇళ్లకే పరిమితమవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది….
బీఆర్‌ఎస్… టీఆర్‌ఎస్‌గా ఉన్న సమయం నుంచి నేతలకు చేతినిండా పనిఉండేది. అధినేత కేసీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఉద్యమించి రాష్ట్రం మొత్తం కదం తొక్కిన గులాబీ శ్రేణులు… 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నుంచి 2018 వరకు దాదాపు పదేళ్లు బిజీబిజీగా ఉండేవారు. అధినేత కేసీఆర్ కూడా నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో జిల్లాల్లో నిత్యం బీఆర్‌ఎస్ నేతల హడావుడి కనిపించేది. కానీ, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌లో మునుపటి పోరాట పటిమ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో హైకమాండ్‌కే స్పష్టమైన విధానం లేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష స్థానంలో బీఆర్‌ఎస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదన్న విమర్శలు పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచీ వినిపిస్తున్నాయి. ప్రధానంగా అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమైపోవడం… సీనియర్ నేతలు ఎవరూ పార్టీ కార్యాలయం వైపు చూడటం కూడా మానేశారంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే విషయంలో ఇంకో విపక్షం బీజేపీ నుంచి బీఆర్‌ఎస్ గట్టి సవాలే ఎదుర్కొంటోందని చెబుతున్నారు.
హైడ్రా విషయంలో?
ప్రస్తుతం హైదరాబాద్‌లో హీట్ పుట్టిస్తున్న హైడ్రా విషయంలో బీఆర్‌ఎస్ వెనకబడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కేటీఆర్, హరీశ్ రావు తప్ప మిగిలిన నేతలు ఎవరూ మాట్లాడటం లేదని అంటున్నారు. ఇక రైతు రుణమాఫీ, గ్యారెంటీల అమలు విషయంలోనూ కేటీఆర్, హరీశ్ రావు తప్ప మిగిలిన బీఆర్‌ఎస్ నేతలు మాటలు ఎక్కడా వినిపించడం లేదంటున్నారు. దీనివల్ల పార్టీ క్యాడర్‌లో అయోమయం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో ఓటమిపై చాలా నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదంటే బీఆర్‌ఎస్ పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. పోరాడితే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేవని.. కానీ, అప్పుడు అస్త్రసన్యాసం చేసినట్లు బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరించడం వల్ల చరిత్రలో లేనటువంటి ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చిందని చెప్పుకుంటున్నారు.
ఇక ఇప్పుడైనా తేరుకుని కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలనే అంశమై పార్టీలో చర్చ జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే పిల్లి మెడలో గంట కొట్టేదెవరు అన్నట్లు అధినేత కేసీఆర్ అడుగు తీసి బయట పెట్టకపోవడం.. పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేస్తే ఏం జరుగుతుందోననే అయోమయం నేతలను వెనక్కి లాగుతుందంటున్నారు.
ఇదే సమయంలో గతంలో ప్రోత్సహించిన వలసలు కూడా ఇప్పుడు పార్టీని ఇబ్బందికి గురిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా గతంలో కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించడం.. ఎన్నికల ముందు వర్గ విభేదాలకు కారణమైందని.. ఇక అధికారం కోల్పోయిన తర్వాత సొంత పార్టీ వారితోపాటు వలస వచ్చిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో చాలాచోట్ల పార్టీ దెబ్బతిన్నాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి బీఆర్‌ఎస్ నాయకత్వం ఎలా ముందుకు వెళుతుందనేదే ఆసక్తికరంగా మారింది.
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా.. తదుపరి కార్యాచరణ ఏంటి?