Target GHMC Mayor : జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీఆర్ఎస్..
ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పితే తాము గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు.

Target GHMC Mayor : పార్టీ మారిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం, ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ప్రభుత్వం మాట తప్పితే గీత దాటాల్సి వస్తుందని వార్నింగ్..
అలాగే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చించామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చేయాల్సిందేనని తలసాని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పితే తాము గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం..!
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ పార్టీ మారటంతో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ పరంగా విజయం సాధించి కాంగ్రెస్ లో చేరారు మేయర్, డిప్యూటీ మేయర్. వారిద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టి గ్రేటర్ హైదరాబాద్ లో తమ పట్టు నిరూపించుకునే యోచనలో బీఆర్ఎస్ ఉంది.
Also Read : దావోస్ వేదికగా పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ, తెలంగాణ రేసు..!
ఏడాది తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు..
ఇవాళ మధ్యాహ్నం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఏడాది తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది.
పార్టీ అధినేత ఆమోదం తర్వాతే తుది నిర్ణయం..
ఈ నేపథ్యంలో ఇప్పుడే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎలా ఉంటుంది అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించి గతంలోనే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ.. దీనిపై ఇవాళ ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత ఆమోదం తర్వాతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : ఈటల రాజేందర్ ఉగ్రరూపం.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగలగొట్టిన బీజేపీ ఎంపీ, కారణం ఏంటంటే..