Davos: దావోస్ వేదికగా పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ, తెలంగాణ రేసు..!
అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ.. రాజకీయ ఎత్తుల్లో భాగంగా..పెట్టుబడులు రాబట్టే విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు సీఎంలు.

Chandrababu Naidu, Revanth Reddy
పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు ఏపీ, తెలంగాణ సీఎంలు. దావోస్ వేదికగా జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ నెల 24 వరకు ఐదు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం మూడు రోజుల పాటు ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులపై డిస్కస్ చేస్తున్నారు.
అటు ఏపీ సీఎం చంద్రబాబు ఐదు రోజుల పాటు దావోస్‌లో పర్యటించి మూడు సెషన్లలో ప్రసంగిస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ ఆర్ధిక సదస్సును అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఏ స్టేట్‌కు ఎక్కువ పెట్టుబడులు రాబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.
దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సు తెలంగాణ సర్కార్ కు సవాల్ గా మారుతుందట. ఏపీ సీఎం గా రంగంలోకి దిగిన చంద్ర బాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారట. అనుభవజ్ఞుడైన బాబు వ్యూహాలకు చెక్ పెట్టేలా చక్రం తిప్పుతున్నాడట తెలంగాణ సేయం రేవంత్ . గతేడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం వెళ్లి దాదాపు 40వేల 322 కోట్ల విలువైన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకొచ్చారు.
అప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు, లోకేశ్ హాజరయ్యారు. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆందోళనకు కారణమవుతోందన్న చర్చ జరుగుతోంది.
అప్పట్లో విమర్శలు
గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్ కాలేదని, అనుకున్నంత పెట్టుబడులు సాధించడంలో ఫెయిల్ అయ్యారని ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఏపీ సీఎం చంద్రబాబు ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఆయన అమరావతితో పాటు వైజాగ్, కర్నూలు, రాజమండ్రిలో పెట్టుబుడులు పెట్టేందుకు కంపెనీలను ఆహ్వానిస్తున్నారు.
సీఎం రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్..ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భాగ్యనగరానికి ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణకు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తే ఓకే. లేకపోతే మళ్లీ ప్రతిపక్షాలకు టార్గెట్ కావాల్సి వస్తుందని రేవంత్ సర్కార్ కలవరపడుతోందట. దావోస్ పెట్టుబడుల విషయంలో తెలంగాణను ఏపీతో పోలుస్తారని..ఏపీకి కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురాకపోతే బీఆర్ఎస్ అటాక్ చేస్తుందని భావిస్తున్నారట.
ఏపీ సీఎం చంద్రబాబు తనకున్న అనుభవంతో దావోస్ ఆర్థిక సదస్సు ద్వారా భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడతారని అంతా భావిస్తున్నారు. అదే గనుక జరిగితే పెట్టుబడులు రాబట్టడంలో ఏపీతో పోల్చితే తెలంగాణ వెనుకబడిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతాయని కంగారు పడుతున్నారట.
ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయ అంశంగా మలుచుకునే అవకాశం ఉండటంతో ఎలాగైనా ఏపీ కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావాలని సీఎం రేవంత్ అండ్ టీం శతవిధాలుగా ప్రయత్నిస్తోందని సమాచారం. అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ.. రాజకీయ ఎత్తుల్లో భాగంగా..పెట్టుబడులు రాబట్టే విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు సీఎంలు. ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావడంలో చంద్రబాబు, రేవంత్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి మరి.
జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసిన ట్రంప్.. ఇక అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఏంటి?