ఏపీ ఎన్నికలు, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఎన్నికలు, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR Chit Chat: లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మోదీ లైన్‌లో పనిచేస్తున్నారా, రాహుల్ లైన్‌లో పనిచేస్తున్నారా అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు.

”బీఆర్ఎస్ 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ 23 ఏళ్లు పూర్తి చేసుకోవడం మాములు విషయం కాదు. గత 140 రోజుల్లో ప్రతి ఒక్కరు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే బావుండేదని అంతా అనుకుంటున్నారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం. సొంత జిల్లాలో పార్టీని గెలిపించుకునేందుకు రేవంత్ గింగిరాలు తిరుగుతున్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేవంత్‌వి చిల్లర మాటలు, ఉద్దేర హామీలు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు మోసం సినిమా పార్ట్ 2 చూపిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం 1 చూపించాడు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో గట్టెక్కడానికే రేవంత్ ఆపదమొక్కులు మొక్కుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 6 గ్యారెంటీల అమలు చేస్తామని రేవంత్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. రేవంత్ మోదీ లైన్‌లో పనిచేస్తున్నారా.. లేక రాహుల్ లైన్‌లో పనిచేస్తున్నారా అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి వైఖరి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది. రేవంత్ క్యాబినెట్ లో ఒక్క మైనారిటీ మంత్రి లేడు.

రేవంత్ త్వరలోనే బీజేపీలో చేరతారన్న నా వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు. సికింద్రాబాద్‌లో కచ్చితంగా పద్మారావు గెలుస్తున్నారు. చేవెళ్లలో కాసాని గెలుపు ఖాయం. మోసపోయామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నరు. తెలంగాణ పుట్టుకను అవమానించారు మోదీ.. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారు. మాకున్న సమాచారం మేరకు ఏపీలో జగన్ గెలవబోతున్నార”ని కేటీఆర్ అన్నారు.

Also Read: లోక్‌స‌భ‌ ఎన్నికలు.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఫలించిన సీఎం రేవంత్ చర్చలు!

ఖమ్మం ఎంపీ సీటు గెలవబోతున్నాం
లోక్‌స‌భ‌ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లు దక్కించుకుంటామని, ఖమ్మం ఎంపీ సీటు గెలవబోతున్నామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీకి 200 నుంచి 220 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ ప్రజలకు ఒక గాయం లాంటదని, పార్టీని విడిచి వెళ్లినవారిని మళ్లీ రానివ్వబోమన్నారు. మల్లారెడ్డి చాలా తెలివైన నాయకుడని.. ఈటెలను మునగ చెట్టు ఎక్కించి కిందపడేస్తాడని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఘోష్ కమిటీ పిలుస్తామని చెప్పడంలో తప్పేమీ లేదన్నారు.

Also Read: నేను గెలిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వస్తాయన్నారు మోదీ.. మరి వచ్చాయా? – కేసీఆర్ ఫైర్