Marriage : కట్నం ఇవ్వలేదని వేరే యువతితో పెళ్లి.. సీఎం కాన్వాయ్ డ్రైవర్ పై కేసు నమోదు!
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నిశ్చితార్థం పూర్తైన తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని సీఎం కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Marriage (2)
Marriage : తనతో నిశ్చితార్థం చేసుకొని వేరొకరిని పెళ్లిచేసుకున్నాడని సీఎం కాన్వాయ్ డ్రైవర్ కానిస్టేబుల్ శశికుమార్ (27)పై హైదరాబాద్ జియాగూడకు చెందిన యువతి మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆమె హెచ్ఆర్సీని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామవాసి శశికుమార్ సీఎం కాన్వాయ్ లో డ్రైవర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి 2019 నవంబర్ నెలలో హైదరాబాద్ కి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.
సంబంధం కుదుర్చుకున్న రోజు కట్నంగా 5 లక్షల నగదుకు ఒప్పందం జరిగిందని, నిశ్చితార్థం తర్వాత రూ.10 లక్షల నగదు 20 తులాల బంగారం ఇస్తేనే చేసుకుంటానని చెప్పినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే శశికుమార్ 2021 ఆగస్టు 26న మరో యువతిని వివాహం చేసుకున్నాడని.. తనను మోసం చేసి వేరే యువతిని పెళ్లిచేసుకోవడంతో పెళ్లి సమయంలోనే కుల్సుంపురా పోలీస్ స్టేషన్, నగర్ కర్నూల్ లో ఫిర్యాదు చేశానని.. వారు పట్టించుకోలేదని వాపోయింది బాధితురాలు. తనకు హెచ్ఆర్సీ న్యాయం జరుగుతుందని ఆశతోనే ఇక్కడ ఫిర్యాదు చేశానని తెలిపారు.
అయితే బాధితురాలి ఫిర్యాదుపై కుల్సుంపురా పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం శంకర్ పర్యవేక్షణలో, ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.