నేటి నుంచి తెలంగాణలో 6,7,8 తరగతులు ప్రారంభం

Classes 6,7,8th will start in Telangana : తెలంగాణలో నేటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా క్లాసులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వీలుకాని పక్షంలో మార్చి ఒకటో తేదీ లోగా ప్రారంభించుకునేందుకు పాఠశాలలకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అయితే కోవిడ్ నిబంధనలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పిల్లలను స్కూల్‌కు పంపే విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
దీంతో 8వేల891 ప్రభుత్వ, 10వేల 275 ప్రైవేట్ పాఠశాలలు, వెయ్యి 157 గురుకులాల్లోని 17లక్షల 10వేల మంది విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. 9, 10 తరగతులకు అనుసరించిన కరోనా మార్గదర్శకాలే ఈ తరగతులకు వర్తిస్తాయని అధికారులు స్పష్టంచేశారు. మే 26వ తేదీవరకు పాఠశాలలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదలచేసింది. ఎస్సెస్సీ పరీక్షలు ముగిసే వరకు పాఠశాలలు నడుస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూతపడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్కూళ్లను ఓపెన్ చేయనున్నారు.