Telangana Dalit Bandhu : ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం : కేసీఆర్

‘దళితబంధు’ కార్యక్రమంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదని.. ఇది ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదేనని.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందని తెలిపారు.

Telangana Dalit Bandhu : ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం : కేసీఆర్

Telangana Dalit Bandhu Scheme

Updated On : July 26, 2021 / 1:03 PM IST

Telangana Dalit Bandhu scheme : ‘దళితబంధు’ కార్యక్రమంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదని.. ఇది ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదేనని.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందని తెలిపారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ ఉద్యమం అయినా ఒక్కడితోనే ప్రారంభం అవుతుందని అలాగే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కూడా ఒక్కడితో ప్రారంభమైందని అలా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని అన్నారు. నమ్మిన ధర్మాన్ని కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడు భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధిస్తామని ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దళిత బంధు దేశానికే ఆదర్శం కానుంది.. రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నామని స్పష్టం చేసారు కేసీఆర్‌.

అలాగే తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమన్నారు.అలా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు. మనిషిపై మనిషి వివక్ష చూపే దుస్థితి గురించి.. సెంటర్‌ ఫర్‌ సెబాల్టర్న్‌ స్టడీ ద్వారా అధ్యయనం చేసానని సీఎం తెలిపారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్‌స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని, అప్పుడే మన విజయానికి బాటలుపడుతాయన్నారు. ఆర్థికంగా ప్రతీ దళితుడు బలపడాలని అప్పుడే దళితులపై వివక్ష పోతుందని సూచించారు. మనుషులు కక్షలు, విద్వేషాలు విడనాడాలని..అవి పోతేనే సాటి మనిషిని మనిషిగా చూడగలమని సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా సూచించారు.ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితబంధువులతో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు.

కాగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల దళిత బంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీంతో ఆ నియోజవర్గంలో రూ. 2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా దళిత బంధువులతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలను పంచుకున్నారు. పథకం అమలుకు చెందిన పలు మార్గదర్శకాలను వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా ఈ దళిత బంధు పథకం అమలు అయ్యేలా సర్కార్ చర్యలు చేపట్టింది.