Kishan Reddy : ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం- బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి ఫైర్
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి అభివృద్ధి మాత్రం ఫామ్ హౌస్ దాటడం లేదు. కేజీ టు పీజీ ఎటు పోయింది? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది? Kishan Reddy

Kishan Reddy Criticise BRS Manifesto (Photo : Facebook)
Kishan Reddy – CM KCR : సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సీఎం కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి, ఓట్ల కోసం కేసీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పుడు బీజేపీ కూడా స్పందించింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. ఇది తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం అంటూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఉద్దేశించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు..
”నయవంచకుడు కేసీఆర్. అమలుకు నోచుకోని హామీలు ఇస్తారు. చిత్తశుద్ధి లేని హామీలు కేసీఆర్ వి. తెలంగాణ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు కేసీఆర్ అమలు చేయలేదు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారు? ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు.
Also Read : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న..! ఏరు దాటినాక బోడి మల్లన్న..! మాదిరిగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంటుంది. కేసీఆర్ కు అహంకారం పెరిగింది. కేసీఆర్ కుటుంబ సంపాదన పెరిగింది. తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను దండుకోవడం కేసీఆర్ పని.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ను నమ్మొద్దు..
కాంగ్రెస్ పార్టీ 60ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మొద్దు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఒకసారి అద్దంలో కేసీఆర్ మీ ముఖం చూసుకోండి. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి అభివృద్ధి మాత్రం ఫామ్ హౌస్ దాటడం లేదు. కేజీ టు పీజీ ఎటు పోయింది? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది? జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమయ్యాయి?
Also Read : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం
కేసీఆర్ కు దమ్ముంటే చర్చకు రావాలి..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏడుంది? 165 గజాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అన్నారు? ఉచిత కరెంటు, ఉచిత విత్తనాలు ఏమైనాయ్? జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఏమయ్యాయి? గల్ఫ్ కార్మికులను ఆదుకున్నారా? కాంగ్రెస్ హయాంలో మూసిన ఫ్యాక్టరీలను ఓపెన్ చేస్తానన్నారు ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది హామీలు కేసీఆర్ అమలు చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధం. కేసీఆర్ చర్చకు రావాలి” అని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి.