CM KCR: సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది.. ఒకేసారి తొమ్మిది మెడికల్ కళాశాలలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో ప్రస్తుతం 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, రాబోయే సంవత్సరంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

CM KCR
Telangana Medical Colleges: తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కళాశాల వద్ద మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. కళాశాలల ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకేసారి తొమ్మిది కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇదని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, రాబోయే సంవత్సరంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలు ప్రారంభిస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రతి యేటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని అన్నారు. రాష్ట్రంలో 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది మనం సాధించిన ఘనత అని కేసీఆర్ అన్నారు. పేద గర్భిణులకు కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నామని, వారికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, మాతాశిశు మరణాలు తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్ వెంట ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు.
KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది దేశ ఆరోగ్య రంగచరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతమని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతోనే జిల్లాకో వైద్య కళాశాల అనే కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందని మంత్రి హరీస్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో ఇదొక పవిత్ర యజ్ఞం అని, ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు.