భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, కేంద్రానికి లేఖ, రూ. 5 వేల కోట్ల నష్టం, రూ. 1,350 కోట్లు ఇవ్వాలి

  • Published By: madhu ,Published On : October 16, 2020 / 06:26 AM IST
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, కేంద్రానికి లేఖ, రూ. 5 వేల కోట్ల నష్టం, రూ. 1,350 కోట్లు ఇవ్వాలి

Updated On : October 16, 2020 / 10:21 AM IST

CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని సీఎం వెల్లడించారు. ఇక భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.




ఉన్నతస్థాయి సమీక్ష :-
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో 2020, అక్టోబర్ 15వ తేదీ గురువారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యలపై సమీక్షించారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షలు :-
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆహారం, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వం తరఫున వెంటనే అందించాలని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.




50 మంది మృతి :-
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల 50 మంది మరణించినట్లు అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆయా శాఖల వారీగా ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు నివేదించారు. గ్రేటర్ పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపారు. ఈ కారణంగా నగరంలోని 72 ప్రాంతాల్లో 144 కాలనీల్లో 20వేల 540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయని, 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయన్నారు.

నష్టంపై ప్రభుత్వం అంచనా :-
జీహెచ్ఎంసితో పాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉందన్నారు. 238 కాలనీలు జలమయం కాగా.. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయన్న నివేదికలు అందాయి. వీటి ఆధారంగానే జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసింది.




మోడీకి కేసీఆర్ లేఖ :-
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని లేఖలో వివరించారు. తక్షణ సహాయ చర్యల కోసం రూ.1,350 కోట్లు సాయంగా అందించాలని కేసీఆర్ కోరారు. రైతులకు సహాయం అందించడానికి రూ.600 కోట్లు, జిహెచ్ఎంసితో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.