జాగ్రత్తగా ఉండండి..! గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు.

Cm Revanth Reddy On Group 1 Aspirants Protests (Photo Credit : Google)
Cm Revanth Reddy : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొంతమంది వ్యక్తులు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 నియామకాలు జరగలేదన్నారు. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ డ్యూటీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపై ఈ వ్యాఖ్యలు చేశారు.
”యువ మిత్రులకు నా సూచన ఒక్కటే. మీ దగ్గరకు నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. వాళ్లు ఎన్నడూ మీ మంచిని కోరుకునే వారు కాదు. మీ భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, యాదిరెడ్డి.. వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆ కుటుంబాల మంచి చెడు గురించి ఆలోచన చేయలేదు.
విద్యార్థులారా.. వాళ్ల ఉచ్చులో పడొద్దు. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉంది. గత పదేళ్లు పరీక్షలు నిర్వహించాలని మీరు ఆందోళనలు చేశారు. ఇవాళ మీ అన్నగా నేను పరీక్షలు నిర్వహిస్తుంటే వద్దని మీతో ఆందోళనలు చేయిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నాకు ఏమైనా ఉద్యోగం వచ్చేది ఉందా? లేక నా కుటుంబానికి లాభం చేకూరేది ఉందా?” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
”ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పీజీ, పీహెచ్ డీ చదివిన పేద విద్యార్థులు.. మీ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఈ ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పోటీ పరీక్షల్లో పోటీ పడండి. ఉద్యోగాలను కొట్టండి. మంచి పౌరులుగా ఈ దేశంలో గుర్తింపు పొందండి. మీకు అవకాశాలు ఇవ్వడం కోసమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఏ పరీక్షలూ నిర్వహించకపోతే నాకు కూడా హాయిగా ఉంటుంది. కానీ, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నిరుద్యోగ యువత కోసం ఈ ఎగ్జామ్స్ పెడుతున్నాం.
పరీక్షల నిర్వహణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మేము పరీక్షలు పెడుతుంటే గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యలో మార్చితే కోర్టులు ఊరుకుంటాయా? ఆందోళన చేస్తున్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. 95శాతం విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. 29 జీవోను హైకోర్టు సమర్థించింది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : మీ చీకటి బతుకులు బయటపెడతా..!- కేటీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..