గ్రూప్-1 పరీక్షలు, జీవో 29పై సీఎం రేవంత్ కీలక ప్రకటన..
గతంలో బీఆర్ఎస్ నేతలు ఏ రోజైనా నిరుద్యోగులను కలిశారా? అని ప్రశ్నించారు.

Group 1 Exams : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 పరీక్షలు యధాతధంగా జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 95శాతం మంది అభ్యర్థులు ఇప్పటికే హాట్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, మరో 5శాతం మంది డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దని, వారి ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు సీఎం రేవంత్. పోలీస్ డ్యూటీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై స్పందించారు.
మరోవైపు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారని, వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వాళ్లపై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగాలకు అనర్హులు అవుతారని సీఎం రేవంత్ అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో పాసైతే.. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పోటీ పరీక్షలు నిత్యం వాయిదా వేయడం వల్ల విద్యార్థులకే నష్టం అన్నారు. తరుచూ ఎగ్జామ్స్ వాయిదా వేస్తే విద్యార్థులు.. ఇతర పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేరని అన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ఏ రోజైనా నిరుద్యోగులను కలిశారా? అని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణను న్యాయస్థానాలు కూడా సమర్థించాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, వెంటనే ఆందోళన విరమించి.. ఎగ్జామ్స్ కు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
జీవో 29 వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న వాదనపై సీఎం రేవంత్ స్పందించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ తో పాటే జీవో 29 ఇచ్చామన్నారాయన. రిజర్వేషన్లు, ఖాళీల భర్తీలో ఒక పోస్టుకు 50 మందిని పిలవాలని నిర్ణయించామన్నారు. 563 గ్రూప్ 1 పోస్టులకు మెయిన్స్ కోసం ఇలానే ఎంపిక చేశామని వెల్లడించారు. ప్రిలిమ్స్ అయ్యాక కొందరు ఒక పోస్టుకు 100 మందిని పిలవాలని అంటున్నారు.. ఆరోజే దీనిపై ముందుకు వచ్చుంటే ఆ తరహా జీవోనే ఇచ్చే వాళ్లం అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
”ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జీవో 29 ఇచ్చి విధి విధానాలను ఖరారు చేసి గతంలో ఇచ్చిన జీవో 55 రద్దు చేసి.. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జీవో 29 ఇవ్వడం జరిగింది. జీవో 29 అంటే.. రిజర్వేషన్లు, ఖాళీల భర్తీలో ఒక పోస్టు ఖాళీ ఉంటే 50 మందిని పిలవాలని ఆ రోజే నిర్ణయించాము. 536 గ్రూప్ 1 పోస్టులకు గాను.. మెయిన్ ఎగ్జామ్స్ కు 1:50 ప్రకారం.. దాదాపు 31వేల మంది విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. 1:50 నోటిఫికేషన్లు ఇచ్చి, అప్లికేషన్లు తీసుకుని, స్క్రూటీని చేసి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించాక.. వితండ వాదాన్ని ఎత్తుకున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు.
1:50 కాదు 1:100 పిలవాలని, అలా చేస్తే ఎక్కువ మంది మెయిన్స్ లో పాల్గొనేందుకు అవకాశం వస్తుందని అంటున్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ లో ఇచ్చిన నిబంధనలను మధ్యలో మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా? అలా మార్చిన ప్రతీసారి పరీక్షలను రద్దు చేసిన సందర్భం, కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి, మీరు.. నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నిజంగానే 1:100 కోరుకుని ఉంటే ఆ రోజే మీరు ముందుకు వచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ లో 1:50 బదులు 1:100 ఇచ్చి ఉండే వాళ్లం” అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : మీ చీకటి బతుకులు బయటపెడతా..!- కేటీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..