Cm Revanth Reddy : హరీశ్ రావు కాంగ్రెస్ లో చేరినా ఉపఎన్నిక రాదు, మా దృష్టి అంతా అభివృద్ధి పైనే- సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబంలో ఉండే పోటీ రాష్ట్రానికి శాపంగా మారింది. వారు కోరుకున్నట్లు ఎన్నికలు రావన్నది గుర్తుంచుకోవాలి.

Cm Revanth Reddy : హరీశ్ రావు కాంగ్రెస్ లో చేరినా ఉపఎన్నిక రాదు, మా దృష్టి అంతా అభివృద్ధి పైనే- సీఎం రేవంత్ రెడ్డి

Updated On : March 26, 2025 / 5:36 PM IST

Cm Revanth Reddy : బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపఎన్నికలు వస్తాయి అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఉపఎన్నికలు వచ్చే ముచ్చటే లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారాయన. హరీశ్ రావు కాంగ్రెస్ లో చేరినా ఉపఎన్నిక రాదు అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ఉపఎన్నికలు వస్తాయని చెప్పడం ఉత్తిదేనని, అది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనే లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

ఉపఎన్నికలపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదన్నారు. మా దృష్టి ఉపఎన్నికల మీద లేదు, మా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఉందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

”కేసీఆర్ కుటుంబంలో ఉండే పోటీ రాష్ట్రానికి శాపంగా మారింది. వారు కోరుకున్నట్లు ఎన్నికలు రావన్నది గుర్తుంచుకోవాలి. కేసీఆర్ వచ్చి కలిసినా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడతా. పద్మారావు, కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య వచ్చి కలిశారు. మంచిని మంచి అంటాము. చెడును చెడు అంటాము. మమ్మల్ని బద్నాం చేస్తే మంచిది కాదు. ముసుగు తొడుక్కుని వ్యవహరించకండి. మేము వివక్ష చూపము.

Also Read : బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు- సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

ఉత్తుత్తి బడ్జెట్, ఊదరగొట్టే బడ్జెట్ మేము పెట్టలేదు. చేసిందే చెబుతాం.. చేసేదే చెబుతాం. గతంలో కాగితాల మీద బడ్జెట్ పెట్టారు. కాగ్ మొట్టికాయలు వేసినా వారు మారలేదు. 25 ఏళ్ల కింద గచ్చిబౌలిలో బిల్లిరావుకు కేటాయించారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బిల్లిరావు నుండి ఎందుకు తీసుకోలేదు? మా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి తిరిగి సాధించింది. అక్కడ పులులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలకు అభివృద్ధి కోసం ఆ భూమిని వాడుకుంటాం.

TGIIC ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా? ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? లేక్ లను, రాక్ లను ఎవరు ఆక్రమించుకున్నారో అన్నీ చెబుతా. మా అత్తగారి కోసం రోడ్ వేయలేదు. సొంతంగా రోడ్డు వేసుకునేంత స్థితిమంతులు మా అత్తగారు. ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్స్, మూసీ పునరుద్ధరించాలా? వద్దా? మల్లన్నసాగర్ భూసేకరణ చేసింది ఎవరు? రిజర్వాయర్ల నుండి ఎవరి ఫామ్ హౌస్ లకు నీళ్లు తీసుకెళ్లారో తెలియదా? మీరు అడిగితే.. అవసరమైతే విచారణ చేస్తా.

ఫోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిటీ.. ఫ్యూచర్ సిటీ. నాలుగున్నర కోట్ల సిటీ.. ఫ్యూచర్ సిటీ. అభివృద్ధిలో మాకు భిన్నాభిప్రాయాలు లేవు. మీరు మంచి చేస్తే కొనసాగిస్తాం. తెలంగాణ మొత్తం మాదే.. మాకు వివక్ష లేదు. సర్కార్ చేస్తున్న అభివృద్ధి, భూసేకరణపై నిజనిర్ధారణ కమిటీ వేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. నిర్వాసితులకు ఏమిద్దామో చెప్పండి. కానీ భూసేకరణ అడ్డుకుంటాం అంటే సరికాదు. కేసీఆర్, రాజ్ నాథ్ సింగ్ అయినా అభివృద్ధి విషయంలో కలిసిపోతాం. సలహాలు సూచనలు కోసం స్పీకర్ మైక్ ఇస్తారు. కుట్రలు కుతంత్రాలకు సభను వాడుకోవద్దు. గంజాయి, బెట్టింగ్, డ్రగ్స్, కోళ్ల పందాలు, క్యాసినోలకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు.

గతంలో ప్రాజెక్టులపై కేసులు వేసిన వారందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కుట్రలో భాగంగానే కేసులు వేయించారు. గతంలో పార్టీ మారిన వారు మంత్రులయ్యారు. అప్పడు రాని ఉపఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? అప్పుడు రూల్స్ మారలేదు.. స్పీకర్ ఆఫీస్ మారలేదు కదా. ఆయన అడుగుల్లో నడిస్తే.. మడుగుల్లో పడి సడుగులు విరుగుతాయి. రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు. సభ్యులకు ఆందోళన, అనుమానాలు అవసరం లేదు. ఉపఎన్నికల మీద కాదు అభివృద్ధిపైనే మా దృష్టి. ప్రతిపక్షం పట్ల మాకు ఎలాంటి ద్వేషం లేదు. ప్రజలు మిమ్మల్ని శిక్షించారు.

Also Read : ఏపీలో పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతి కేసు ఇంత సంచలనంగా ఎందుకు మారింది? అసలేం జరుగుతోంది?

గతంలో వామన్ రావు దంపతులను నరికి చంపారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. గత సర్కార్ హయాంలో దిశ ఘటన జరిగింది. 2020లో దేశంలో మహిళలపై జరిగిన ఘటనల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. జూబ్లీహిల్స్ పబ్ లో మైనర్ బాలికపై లైంగిక దాడిలో బీఆర్ఎస్ నేతల కొడుకులు ఉన్నారని తెలిసిందే.

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. రాష్ట్ర అభివృద్ధి జరగకుండా దురుద్దేశ్యంతో ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. స్వార్థం కోసం ప్రభుత్వం మీద, అభివృద్ధి మీద యాసిడ్ దాడి చేస్తున్నారు. కుట్రలు మానుకోవాలి. విజ్ఞతతో మాట్లాడండి. ప్రతిపక్షాలకు సామాజిక బాధ్యత లేదా? తెలంగాణను ఆదర్శంగా నిలపాలని చేస్తుంటే.. దురుద్దేశ్యంతో అడ్డుపడుతున్నారు. ధరల నియంత్రణలో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. కడుపు నిండా విషం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు” అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.