Cm Revanth Reddy: ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి, బండారు దత్తాత్రేయకు ఇస్తేనే న్యాయం- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని తాను కోరతానని రేవంత్ రెడ్డి చెప్పారు.

Cm Revanth Reddy: ఉప రాష్ట్రపతి పదవిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవిని తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రేవంత్ రెడ్డి. అంతేకాదు బండారు దత్తాత్రేయను వైస్ ప్రెసిడెంట్ చేయాలని ఆయన సూచించారు. దత్తన్నకు ఆ పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని తాను కోరతానని రేవంత్ రెడ్డి చెప్పారు. దత్తాత్రేయను అభ్యర్థిగా ప్రకటిస్తే తాను ఇండియా కూటమితో మాట్లాడతానన్నారు.
జగదీప్ ధన్ ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేసినట్లు ధన్ ఖడ్ తెలిపారు. అనూహ్యంగా ఆయన తీసుకున్న రాజీనామా నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెల్త్ రీజన్స్ అని ఆయన చెబుతున్నా దీని వెనుక ఏదో పెద్ద కథ ఉందని విపక్షాలు ఓపెన్ గానే అంటున్నాయి. తాజాగా జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వైస్ ప్రెసిడెంట్ పదవిని తెలంగాణకు ఇవ్వాలని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
‘ఏ కారణంతో ధన్ ఖడ్ పదవికి ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు. ఆయన నిర్ణయం దురదృష్టకరం. ఉప రాష్ట్రపతి పదవిని తెలంగాణకు ఇవ్వాలి. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవిని లాక్కుని కిషన్ రెడ్డికి ఇచ్చారు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలను రాంచందర్ రావుకి ఇచ్చారు. తెలంగాణలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో వారందరికీ ఎన్డీయే అన్యాయం చేసింది. దానికి క్షమాపణగా మా దత్తన్నను వైస్ ప్రెసిడెంట్ చేయాలి. తెలంగాణకు కేంద్రం చాలా అన్యాయం చేసింది.
హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాష తెలుగు. తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు. దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేస్తే మీరు చేసిన తప్పులు కొంత వరకు మాఫీ అవుతాయి. తెలంగాణ ప్రజల తరపున ఓబీసీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. పార్టీ నిర్ణయాలను ప్రకటించడానికి నేనిక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నాను. ఢిల్లీలో మా ప్రాంత నాయకత్వానికి ఎన్డీయే తీవ్ర అన్యాయం చేసింది.
ఢిల్లీలో తెలంగాణ నాయకత్వమే లేకుండా చేసే కుట్ర జరుగుతోంది. కాబట్టి దత్తాత్రేయకు పదవి ఇవ్వాలని కోరుతున్నా. దత్తన్న సౌమ్యుడు. ఆయనకు అందరి ఆమోద్య యోగం ఉంది. ఆయనకున్న గవర్నర్ పదవిని కూడా తొలగించారు. కాబట్టి ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.