Cm Revanth Reddy: పనిచేస్తేనే పదవులు, మరోసారి అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చేయాలి- సీఎం రేవంత్ రెడ్డి

పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం.

Cm Revanth Reddy: పనిచేస్తేనే పదవులు, మరోసారి అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చేయాలి- సీఎం రేవంత్ రెడ్డి

Updated On : June 24, 2025 / 5:59 PM IST

Cm Revanth Reddy: పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పని చేయాలన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అన్న సీఎం రేవంత్.. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళగలుగుతామన్నారు.

పార్టీ నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలని సీఎం రేవంత్ సూచించారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పని చేయాలని కోరారు. మరోసారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేలా అంతా పని చేయాలన్నారు. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పని చేస్తేనే పదవులు వస్తాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

””కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదవుల కోసం ఎంతోమంది పోటీపడ్డారు. పార్టీ కోసం కష్టపడితే కచ్చితంగా పదవులు వస్తాయి. పార్టీ బాధ్యత మోపిన వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది. కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుంది. పదేళ్లు అధికారం నడిపించే బాధ్యత నాది. గత ప్రభుత్వం పదేళ్లు పాలించినా ఉద్యోగాలు ఇవ్వలేదు.

పార్టీ కష్ట కాలంలో పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వo అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం

 

ఏడాదిన్నరలో 95వేల కోట్లు కేవలం సంక్షేమం కోసమే ఖర్చు చేశాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పార్టీ నిర్మాణం గురించి బూత్ స్థాయి నుంచి బలోపేతంపై చర్చించాం. సీఎం రేవంత్ నాయకత్వంలో ఏడాదిన్నర కాలంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని గోల్డెన్ పీరియడ్ గా అభినందించాం. రుణ మాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం బోనస్ వంటి వాటిపై చర్చించాం. ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రతీ నియోజకవర్గంలో 4500 ఇళ్లు ఇస్తున్నాం. ఉచిత బస్సు కింద 6 వేల కోట్ల సబ్సిడీ ఆర్టీసీకి అందజేశాం. 93లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నాం. ఏడాదిన్నరలో 95,351 కోట్లు కేవలం సంక్షేమం కోసం ఖర్చు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, గోల్డెన్ పీరియడ్ ను జనంలోకి తీసుకెళ్లాలని పీఏసీలో నిర్ణయించాం.