తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ఈ కామెంట్స్ ఎందుకు చేశారు?

ఓవరాల్‌గా సీఎం రేవంత్ కామెంట్స్.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయ్‌.

తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ఈ కామెంట్స్ ఎందుకు చేశారు?

Updated On : March 27, 2025 / 7:57 PM IST

తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు.. పొలిటికల్ సర్కిల్స్‌ను హీటెక్కిస్తున్నాయ్. ఫిరాయింపుల వ్యవహారం కోర్టులో ఉండగా అలా ఎలా మాట్లాడతారని కొందరు అంటుంటే.. రేవంత్‌ మాటలు చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఆయన మాటల వెనక స్ట్రాటజీ ఉందా.. అసలు మతలబు ఏంటి అంటూ.. ఆ కామెంట్స్‌ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు మరికొందరు. రేవంత్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడినట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయమా.. లేదంటే మరో వ్యూహమా.. సీఎం మాటలు నిజంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా?

ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయ్. ఉప ఎన్నికలు రావు అంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యల భారీ వ్యూహమే కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఏడాది కింద బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పది మంది కారుకు బైబై చెప్పి చేయి అందుకున్నారు. జంపింగ్‌లపై బీఆర్ఎస్‌ కోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపుల కింద ఎమ్మెల్యేలపై అన‌ర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయ్‌. ఇక అటు సుప్రీంకోర్టు కూడా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో కాస్త సీరియ‌స్‌గానే ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేయలేదు.. ఫిరాయింపులతో వార్షికోత్సవం జరుపుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కూడా ! ఇక అటు ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు… అసెంబ్లీ స్పీక‌ర్ నోటీసులు జారీ చేశారు.

సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉండడంతో.. పార్టీ మారిన ప‌ది మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఇక అటు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలు ఖాయం అంటూ హడావుడి స్టార్ట్ చేసింది. త్వర‌లో ప‌ది స్థానాల్లో బైపోల్ జరగడం ఖాయం అని.. కేడర్ సిద్ధంగా ఉండాలంటూ కేసీఆర్‌తో సహా కారు పార్టీ నేతలంతా పదేపదే అంటున్నారు. ఇక అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా.. అధికార కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇబ్బందులు త‌ప్పడం లేద‌న్న ఆవేద‌న‌
ఏ ల‌క్ష్యంతో వచ్చామో.. ఆ ప‌ని జ‌ర‌గ‌కపోగా.. తిరిగి కోర్టు నుంచి ఇబ్బందులు త‌ప్పడం లేద‌నే ఆవేద‌న‌లో ఉన్నారట. నియోజకవర్గాల్లో పనులు జరగగడం లేదని.. దీంతో జనాల్లోనూ చులకన అవుతున్నామనే భావనలో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఐతే ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీ నుంచి కనీసం ఎవరూ తమను ఓదార్చేందుకు ముందుకు రావడం లేదని తెగ ఫీల్ అవుతున్నారట. పటాన్‌చెరులాంటి చోట్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.

దీంతో ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి.. పీచేమూడ్ అంటూ వెన‌క్కి వెళ్లారు. తాను పార్టీ మార‌లేద‌ని.. బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటూ సుప్రీంకోర్డులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మహిపాల్ రెడ్డి బయటపడినా.. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నారని.. బైపోల్ టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతున్న వేళ.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అవుతున్నాయ్.

పార్టీ మారి వచ్చిన మిగతా నేతలపై.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎఫెక్ట్ ప‌డే ప్రమాదం ఉండ‌టంతో.. అధికారపక్షం అలర్ట్ అయింది. పార్టీ మారి వ‌చ్చిన వారికి ధైర్యం చెప్పేందుకు సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారట. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు న్యాయ‌స్థానంలో ఉన్నా… ధైర్యం చేసి అసెంబ్లీ వేదిక‌గా ఆయన సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు రావ‌ని.. బీఆర్ఎస్‌ నేతల క‌ల‌లు నిజం కావ‌ని అన్నారు.

సుప్రీంకోర్టులో వాద‌న‌లు జరుగుతున్న వేళ.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, అది కోర్టు ధిక్కరణ కిందరు వస్తుందని తెలిసినా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ధైర్యం చెప్పడం కోసం సీఎం ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటున్నారు. దీంతో పాటు ఫిరాయించిన ఎమ్మెల్యేల ప‌నుల‌ను కూడా.. అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత పూర్తి చేయాల‌ని సీఎం నిర్ణయించార‌ట‌.

ఐతే అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ఎక్కడా న్యాయ‌స్థానం పేరు ప్రస్తావించకుండా.. కేవ‌లం ఉపఎన్నిక‌ల అంశాన్ని మాత్రమే మాట్లాడారని.. ఇవి కోర్టు ధిక్కర‌ణ కింద‌కు రావని.. అధికార ప‌క్షం అంటోంది. ఐతే బీఆర్ఎస్‌ మాత్రం.. ఈ వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అంటోంది.

ఓవరాల్‌గా సీఎం రేవంత్ కామెంట్స్.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయ్‌. రేవంత్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఎలా తీసుకుంటుంది.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా… న్యాయ‌స్థానం పేరును ప్రస్తావించ‌లేద‌ని వ‌దిలేస్తుందా అనేది తేలాలంటే.. నెక్ట్స్ వాదనల వరకు వెయిట్ చేయాల్సిందే.