Cm Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. చైనా, పాకిస్తాన్ రెండింటినీ ఓడిస్తారు- సీఎం రేవంత్ రెడ్డి
చైనా, పాకిస్తాన్ భారత్ వైపు చూస్తే గుడ్లు పీకి గోళీలు ఆడతామని ఆనాడు ఇందిరమ్మ చెప్పింది. పాక్ కు సపోర్ట్ గా వచ్చిన అమెరికాను హెచ్చరించిన ఉక్కు మహిళ ఇందిరి గాంధీ.

Cm Revanth Reddy: కేంద్రం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో కేంద్రం వైఖరిని ఆయన తప్పుపట్టారు. యుద్ధాన్ని ఎందుకు ఆపేశారో చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భయపడి యుద్ధాన్ని ఆపేశారా? అని ప్రశ్నించారు.
పాకిస్తాన్ తో యుద్ధం చేయండి, పీవోకేని స్వాధీనం చేసుకోండి అని కాంగ్రెస్ కోరిందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎవరు లొంగ దీసుకున్నారో, ఎవరికి భయపడ్డారో తెలియదు కానీ.. ప్రధాని మోదీ యుద్ధాన్ని ఆపేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. చైనా, పాకిస్తాన్.. రెండింటినీ ఓడిస్తారని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జైహింద్ యాత్రలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
”మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటా. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి కార్యకర్తలు రక్తాన్ని చిందించి నన్ను గెలిపించారు. మీరు కష్టపడ్డారు కాబట్టే నేను సీఎం అయ్యాను. దేశ భద్రత విషయంలో మనమందరం సైన్యానికి అండగా నిలబడాలి.
పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ ప్రకటించింది. యుద్ధం చేయండి, పీవోకేని స్వాధీనం చేసుకోండి అని ప్రధాని మోదీని కాంగ్రెస్ కోరింది. ఎవరు లొంగ దీసుకున్నారో, ఎవరికి భయపడ్డారో తెలియదు కానీ.. ప్రధాని మోదీ యుద్ధాన్ని ఆపేశారు. ట్రంప్ చెప్పారని యుద్ధం నిలిపివేశారు.
యుద్ధం ఆపేస్తున్న సమయంలో ప్రధాని మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలువలేదు? చైనా, పాకిస్తాన్ భారత్ వైపు చూస్తే గుడ్లు పీకి గోళీలు ఆడతామని ఆనాడు ఇందిరమ్మ చెప్పింది. నాడు అమెరికా అధ్యక్షుడికి గట్టి సమాధానం చెప్పిన వ్యక్తి ఇందిరా గాంధీ. పాక్ కు సపోర్ట్ గా వచ్చిన అమెరికాను హెచ్చరించిన ఉక్కు మహిళ ఇందిరి గాంధీ.
పహల్గాం ఘటన తర్వాత మొట్ట మొదటగా తెలంగాణలో ర్యాలీ చేశాం. 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకుంటే బీజేపీ నాయకులు ఎటు పోయారు? చైనాను ఓడించినందుకు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారా? ఆనాడు పాక్ ను గట్టి దెబ్బ కొట్టినందుకు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారా? బీజేపీ దేని కోసం తిరంగా ర్యాలీలు చేస్తోంది? దేశంలోనే భద్రతకు గుండె మన కంటోన్మెంట్ మేడ్చల్ మల్కాజిగిరిలో ఉంది. ఎన్ని యుద్ధ విమానాలను పాక్ కూల్చిందో ప్రధాని మోదీ చెప్పాలి. ప్రధాని మోదీ రద్దైన వెయ్యి రూపాయల నోటు” అని విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.