ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే మా ఆలోచన.. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్వావసు నామ సంవత్సరం అందరికీ సంతోషాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని అన్నారు.
భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితంలా ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి, పేదలకు విద్య అందించేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ అంటూ.. దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి.. ఆ మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
Also Read: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. తెలంగాణలోని కౌలు రైతులకు శుభవార్త..
దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. అందులో భాగంగానే ప్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమేకాదు.. పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందని, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ప్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్న బియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుభాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలన్నది మా ప్రభుత్వ విధానం అని రేవంత్ అన్నారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ఇది అబివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్ -2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబడెతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.