తెలంగాణ కేబినెట్‌లోకి కొత్తగా నలుగురికి చాన్స్.. ఫైనల్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్..? ప్రకటించేది ఎప్పుడంటే..

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి.

తెలంగాణ కేబినెట్‌లోకి కొత్తగా నలుగురికి చాన్స్.. ఫైనల్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్..? ప్రకటించేది ఎప్పుడంటే..

CM Revanth Reddy

Updated On : May 27, 2025 / 10:37 AM IST

Telangana Cabinet expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ లో ఆరు పదువులు ఖాళీ ఉండగా.. కొత్తగా నలుగురిని తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లనుసైతం కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఢిల్లీ టెన్ జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణతోపాటు పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాక నాలుగు మంత్రి పదవుల భర్తీకి సంబంధించి ఏడుగురి పేర్లు ప్రయారిటీలో ఉన్నాయని వివరించారని, దానిపై లిస్ట్ కూడా అందజేసినట్లు సమాచారం. అదేవిధంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్ట్ ను సమర్పించినట్లు తెలిసింది. వేణుగోపాల్ తరువాత టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా రాహుల్ తో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్లు తెలిసింది.

 

రాహుల్‌తో భేటీ తరువాత మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పామని, కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే కేబినెట్ కూర్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఒకటి రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని మహేశ్ గౌడ్ వెల్లడించారు.

 

తెలంగాణ కేబినెట్ లో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు మంత్రి పదవులకుగాను ఏడుగురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు, వీరిలో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన నలుగురిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి మంగళవారమే కేబినెట్‌లో చోటుదక్కించుకున్న వారి పేర్లపై ప్రకటన రావాల్సి ఉన్నా ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలిసింది.

ఖర్గే ఈనెల 30న ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది. ఆయన రాగానే మంత్రి వర్గం విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని ఆశావహులు ఆశగా ఎదురు చూస్తున్నారు.