Rythu Bandhu: రైతు భరోసా అమలుపై సందిగ్ధంలో కాంగ్రెస్ సర్కార్..!

అందుకే ఆరు నెలలుగా కరసత్తు చేసినా, ఆదివారం రెండున్నర గంటలపాటు చర్చించినా రైతు భరోసా నియమ నిబంధనల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట క్యాబినెట్ సబ్ కమిటీ.

Rythu Bandhu: రైతు భరోసా అమలుపై సందిగ్ధంలో కాంగ్రెస్ సర్కార్..!

Rythu Bandhu scheme

Updated On : December 30, 2024 / 9:18 PM IST

రైతు భరోసా పథకం అమలుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణ ప్రభుత్వం. అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు..రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. గతేడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టాక జనవరిలో యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని కోటి 57 లక్షల ఎకరాలకు 7వేల 625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఆ తర్వాత ఏడాది కాలంగా రైతు భరోసా పథకాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం చాలా వరకు దుర్వినియోగం అయ్యిందని, పంటలు వేయని బీడు భూములకు, కొండలు-గుట్టలు ఉన్న భూములకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హులైన, సాగుచేసే భూములమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా రైతు భరోసా పథకానికి కొత్త నియమ నిబంధనలను పెట్టాలని భావించిన రేవంత్ సర్కార్..క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

సలహాలు, సూచనల సేకరణ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్ష్యతన మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం వేయగా..గత ఆరు నెలల కాలంలో పలుసార్లు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పలు జిల్లాల్లో పర్యటించడంతో పాటు రైతులు, వివిధ రంగాలకు చెందిన మేధావులతో సమావేశమై రైతు భరోసాపై సలహాలు, సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు.

రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు పది ఎకరాలలోపు ఉన్నవారేనని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం..రైతు భరోసా విషయంలో అందరికి కాకుండా కటాఫ్ పెట్టాలని భావించింది. అంతే కాకుండా పంటలు పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనుకున్నారు. అయితే ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలన్నదానిపైనే ఇంకా సందిగ్ధంలో ఉంది రేవంత్ సర్కార్. 7 నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినా..ఈ విషయంలో మంత్రి ఉపసంఘంలో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది.

ఇక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్స్‌కు రైతు భరోసా ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం భేషరతుగా అందరికీ రైతు బంధు ఇస్తే..ఇప్పుడు కండీషన్స్‌ పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తే ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఆదివారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగగా డిప్యూటీ సీఎం భట్టితో సహా మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, తుమ్మల తలో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది.

రైతు భరోసా ఇవ్వకపోతే వీరి నుంచి వ్యతిరేకత!
ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వకపోతే వారి నుంచి వ్యతిరేకత వస్తుందని ఓ మంత్రి చెప్పారట. సింగరేణి లాంటి సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఏడు జిల్లాల్లో ఉంటారని..రైతు భరోసా వారికి ఇవ్వకపోతే ముందు ముందు చిక్కులు తప్పవని మరో మంత్రి చెప్పుకొచ్చారట. ఇక ఐటీ చెల్లింపుదారుల్లో చాలా మంది రుణాల కోసం ఐటీ ఫైల్ చేసినవారు ఉంటారని, అలాగని వారందరికి రైతు భరోసా ఇవ్వకపోతే వ్యతిరేకత తప్పదని మరో మంత్రి మనసులో మాట చెప్పారని తెలుస్తోంది.

అంతేకాకుండా రైతు భరోసాకు సీలింగ్ పెట్టి కొన్ని వర్గాలకు ఇవ్వకపోతే ప్రతిపక్షాల నుంచి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా రైతు భరోసా విషయంలో ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న అంశం నుంచి మొదలు..ఏయే వర్గాలను ఈ పథకం నుంచి తప్పించాలన్న అంశంపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

అందుకే ఆరు నెలలుగా కరసత్తు చేసినా, ఆదివారం రెండున్నర గంటలపాటు చర్చించినా రైతు భరోసా నియమ నిబంధనల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట క్యాబినెట్ సబ్ కమిటీ. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకోవాలని, అందుకే మంత్రివర్గంలో చర్చించాకే రైతు భరోసాపై క్లారిటీ వస్తుందని సచివాలయవర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరెవరికి రైతు భరోసా ఇస్తారు.? ఎన్ని ఎకరాల వరకు లిమిట్‌ పెడుతారనే దానిపై..సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

జగన్ టార్గెట్‌గా పవన్ దూకుడు.. రాయలసీమపైనే ఫోకస్..! రాయలసీమలో క్యాంప్‌ ఆఫీస్‌ పెట్టబోతున్నారా?