ఓరుగల్లు గడ్డ తమ అడ్డా అంటున్న కొండా దంపతులు.. మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది?

కొండా సురేఖ గతంలో చేసిన కామెంట్సే ఇప్పటికీ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా ఉన్నాయి.

ఓరుగల్లు గడ్డ తమ అడ్డా అంటున్న కొండా దంపతులు.. మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది?

Updated On : June 20, 2025 / 9:50 PM IST

ఓరుగల్లు గడ్డ తమ అడ్డా అంటుంటారు కొండా దంపతులు. మీ డామినేషన్ ఎక్కువైంది తగ్గించుకోండండి అంటున్నారు జిల్లాలోని హస్తం ఎమ్మెల్యేలు. ఈ ఇష్యూ ఎప్పటినుండో కాకరేపుతున్నా.. లేటెస్ట్‌గా కొండా మురళి చేసిన కామెంట్స్‌ తో వ్యవహారం పీక్స్‌ కు చేరింది. సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కొండా మురళి చేసిన ఇండైరెక్ట్‌ విమర్శలు హాట్ టాపిక్‌ అయ్యాయి. ఆ ఇద్దరు ముందు టీడీపీని .. ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌ను భ్రష్టు పట్టించారని విమర్శించారు మురళి.

ఏకంగా కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ కనుబొమ్మలు గీక్కునే నేత అంటూ పర్సనల్ అటాక్ చేశారు. 75ఏళ్ల ముసలివాడు రేవూరి తన కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యే అయ్యారంటూ తీవ్ర కామెంట్లు చేశారు. కడియం శ్రీహరిని ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అభివర్ణించారు కొండా మురళి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఎలాగోలా కొండా దంపతులను భరిస్తూ వచ్చామని..ఇప్పుడు వాళ్లను భరించడం తమవల్ల కాదని..యాక్షన్ తీసుకోవాల్సిందేనంటూ పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు, ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి కంప్లైంట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: జూబ్లీహిల్స్ టికెట్ ఫైట్.. తానే అభ్యర్థినన్న అజారుద్దీన్‌.. రేసులోకి ఈ నేతలు.. గెలిస్తే గ్రేటర్‌ కోటాలో మంత్రి కావచ్చన్న ప్లాన్

అయితే ఎమ్మెల్యేల మీద చేసిన కామెంట్స్‌తోనే వివాదం నడుస్తుంటే.. ఈ రోజు ఏకంగా సీఎం కోటరీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు కొండా మురళి. ఇక ఎమ్మెల్యేలపై.. సీయం కోటరీపై భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యల దుమారాన్ని చల్లార్చాల్సిన మంత్రి కొండా సురేఖ… మరింత ఘాటు వ్యాఖ్యలతో అగ్ని కి ఆజ్యం పోయడం ఆసక్తిరేపుతోంది.

మీడియాతో చిట్‌చాట్‌లో కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ అటాక్‌ చేసిన ఆమె… మంత్రిగా ఉన్న తనముందు ఎమ్మెల్యేగా కడియం కూర్చోలేకపోతున్నారని.. అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో కొండా దంపతుల కాంట్రవర్సీ కామెంట్స్‌ కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు..అంతకు మించి రచ్చకు దారి తీస్తున్నాయి. సొంత పార్టీ నేతలపైనే రెచ్చిపోయి చేస్తున్న కొండా దంపతుల కామెంట్స్‌ చూస్తుంటే తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కూడా..
గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కూడా కొండా దంపతులకు ఓరుగల్లు కారు పార్టీ నేతలతో ఇలాగే వైరం ఉండేది. ఏ ఒక్కరితో కూడా సరిగ్గా గిట్టకపోయేది. వాళ్ల డామినేషన్‌ ఎక్కువైందని వరంగల్ బీఆర్ఎస్‌ నేతలంతా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయ్. ఆ తర్వాత కేసీఆర్ టికెట్‌ ఇవ్వకపోవడంతో..కాంగ్రెస్‌ గూటికి చేరారు కొండా సురేఖ.

విపక్షంలో ఉన్నన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్న ఉన్న కొండా దంపతులు.. కాంగ్రెస్‌ పవర్‌లోకి వచ్చాక మళ్లీ తమ హవా చూపించడం స్టార్ట్ చేశారు. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు అస్సలు గిట్టడం లేదు. ఇప్పుడు లేటెస్ట్‌ ఇష్యూతో మరోసారి జిల్లా లీడర్లంతా కొండా దంపతులపై గుర్రుగా ఉన్నారు. ఎస్పెషల్‌గా కడియం, రేవూరి అయితే చాలా సీరియస్‌గా ఉన్నారట. కొండా దంపతులపై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని పట్టుబడుతున్నారట.

కొండా సురేఖ గతంలో చేసిన కామెంట్సే ఇప్పటికీ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా ఉన్నాయి. సమంత విషయంలో ఆమె మాట్లాడిన మాటలు పెద్ద దుమారం లేపాయి. అప్పట్లోనే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న టాక్ నడిచింది. కొందరు మంత్రులు కమీషన్లు తీసుకుని ఫైల్స్‌పై సంతకం చేస్తారని… తాను అలా కాదంటూ ఆమె చేసిన కామెంట్స్‌ కూడా వివాదాస్పదం అయ్యాయి. ఇలా వరుస ఇష్యూస్‌తో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన కొండా సురేఖ కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు.

ఇప్పుడు కొండా మురళి కామెంట్స్‌కు తోడు ఆమె మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు. ఓరుగల్లు కాంగ్రెస్ నేతలంతా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో కొండా సురేఖను క్యాబినెట్‌ నుంచి తప్పిస్తారా లేదా కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది డిస్కషన్ పాయింట్‌గా మారింది. భవిష్యత్‌ లో జరిగే విస్తరణలో మంత్రిపదవికి ముప్పు తప్పదనే ఇలా రివర్స్‌ ఎటాక్‌ చేస్తున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా వరంగల్‌ జిల్లా నేతలు మాత్రం కొండా దంపతులకు ముగుతాడు వేయాల్సిందేనని…వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటున్నారట. చూడాలి కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో…