Corona Vaccination : తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్.. కారణం ఇదే

తెలంగాణలో మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిలిచిపోయింది. వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని ఇవాళ, రేపు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్‌ తొలి, రెండో డోస్‌ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Corona Vaccination : తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్.. కారణం ఇదే

Corona Vaccination Drive

Updated On : May 15, 2021 / 7:27 AM IST

Corona Vaccination Drive : తెలంగాణలో మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిలిచిపోయింది. వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని ఇవాళ(మే 15,2021), రేపు(మే 16,2021) నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్‌ తొలి, రెండో డోస్‌ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ని రద్దు చేసింది. మే 17న తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి మొదటి డోస్ తర్వాత 12 వారాలు దాటాకే రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ను 6-8 వారాల తర్వాత ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో శని, ఆది వారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని నిలిపివేస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా కట్టడికి రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరోవైపు పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 57వేల 416 కరోనా పరీక్షలు చేయ‌గా 4వేల 305 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గ్రేట‌ర్ హైదరాబాద్ (GHMC) ప‌రిధిలోనే అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కొత్తగా గుర్తించిన కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 5,20,709 కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 2,896కి పెరిగింది. శుక్ర‌వారం 6వేల 361 మంది కరోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 54వేల 832 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మార్కెట్లు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు లాంటి రద్దీ ప్రదేశాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆ తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారి వాహనాలు కూడా సీజ్ చేస్తున్నారు.