కరోనా కలకలం : షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు – మంత్రి ఈటెల

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 12:58 AM IST
కరోనా కలకలం : షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు – మంత్రి ఈటెల

Updated On : March 4, 2020 / 12:58 AM IST

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. కొంతకాలం పాటు ఎవరికీ షేక్‌ హ్యాండ్ ఇవ్వొద్దని ఈటల సూచించారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితేనే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్‌ను అరికట్టవచ్చన్నారు. మిలిటరీ, చెస్ట్‌, ఫీవర్‌, వికారాబాద్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు పలు సూచనలు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లపై ఆయన వివరించారు. (నగరంలో కరోనా (covid 19) భయం : బాధిత యువకుడు 85 మందిని కలిశాడా)

వైద్య కళాశాలల్లో 600 నుంచి 800 పడకలు ఉన్నాయని… వాటిలో 200 పడకలు ఐసోలేషన్‌ కోసం వాడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మిగతా ఆస్పత్రుల్లో 3వేల పడకలకుపైగా వాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 200 నుంచి 300 మందికి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు రెండ్రోజుల్లో 59 మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. నిన్న 44 మంది అనుమానితులు రాగా.. సోమవారం 15 మంది అడ్మిట్‌ అయ్యారు. వారిలో ఆరుగురికి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. మిగతా రిపోర్టులను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసు నమోదైన మరుసటి రోజే  కామారెడ్డిలో  కలకలం రేగింది.  ఓ ప్రైవేటు ఆస్పత్రికి జ్వరం, తుమ్ములతో వచ్చిన వ్యక్తిని కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేయడం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కల్లోలం సృష్టించింది. ఇందల్‌వాయి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన బాల్‌రాజ్‌  కొంతకాలం క్రితం దుబాయ్‌ వెళ్లాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. జ్వరం, తుమ్ములు ఎక్కువగా ఉండడంతో నిన్న కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు వచ్చాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో అంబులెన్స్‌లో బాల్‌రాజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.