CPI – Congress : టీకాంగ్రెస్ నేతలతో సీపీఐ నాయకులు రహస్య భేటీ.. నాలుగు సీట్లు కావాలని ప్రతిపాదన
ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.

Congress CPI Secret Meeting
CPI Congress Secret Meeting : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైన వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు, ఊహించని ట్విస్టులతో వేడెక్కాయి. సీపీఐ నేతలు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో చర్చించారు. తమకు మొత్తం 4 సీట్లు కావాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టారు. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలపై సీపీఐ గురి పెట్టింది. అయితే కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లే ఇస్తామని అంటోంది.
మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కనీసం మూడు సీట్లైనా ఇచ్చేలా సీపీఐ ప్రతిపాదన చేసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ తెలంగాణలో తమది ఒంటరి పోరేనని సంకేతాలు ఇచ్చింది. దీంతో కామ్రేడ్ల పరిస్థితి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్లు అయింది.
మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తమను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తో కలిసి వెళ్లేది లేదని లెఫ్ట్ నేతలు తేల్చి చెప్పారు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై వామపక్షాలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నాయి. సీపీఎం ఆఫీస్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన లెఫ్ట్ నేతలు రానున్న ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే కామ్రేడ్లతో బీఆర్ఎస్ దూరమైంది. సీపీఐతో కలిసి పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది.
ఎలాగో బీజేపీతో పొసగని లెఫ్ట్ నేతలకు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న ఒకే ఒక్క ఆప్షన్
కాంగ్రెస్ పార్టీ. ముందు నుంచి కాంగ్రెస్, లెఫ్ట్ మధ్య అవసరమైన సమయంలో పొత్తులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో టీకాంగ్రెస్ నేతలతో సీపీఐ నాయకులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొత్తులు, ఇతర అంశాలపై తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్ లో టీకాంగ్రస్ నేతలతో సీపీఐ సీక్రెట్ మీటింగ్ పై కామ్రేడ్లు బయటికి చెప్పకున్నా చాడా వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు హస్తం పార్టీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.
సీపీఐ నేతలను పొత్తుల కోసం ఆహ్వానించారు. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే చాలా చోట్ల గెలుపును ప్రభావితం చేయొచ్చనే భావనలో కాంగ్రెస్ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ కు నష్టం కలుగకుండా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని అటు అధికార బీఆర్ఎస్ ను ఇటు బీజేపీని ఇరకాటంలో పడేయాలనేది ప్రధానమైన వ్యూహంగా ఉంది. లెఫ్ట్ నేతలు మాత్రం కుదిరితే కాంగ్రెస్ తో లేదా తామే కలిసి ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా ప్రిపేర్ అయ్యారు.
Assam : బీజేపీ ఎంపీ ఇంట్లో ఉరివేసుకున్న 10 ఏళ్ల బాలుడు.. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
తమకు బలం ఉన్న నియోజకవర్గాలపై పట్టు కోల్పోకుండా సీట్లు అడిగేందుకు సిద్ధమయ్యారు. అలా అయితేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. దీనిపై వీలైనంత త్వరగా కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. టీకాంగ్రెస్ నేతలతో లెఫ్ట్ నేతల భేటీ కొలిక్క వస్తే పొత్తులపై ముందుకు వెళ్లి అప్పుడు బయటికి ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రానికి కాంగ్రెస్ తో పొత్తులపై ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు.