చిత్రపురి కాలనీలో విల్లాలు కూల్చివేత.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ఈ క్రమంలో సొసైటీ సభ్యులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.

Illegal Constructions Demolition : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మణికొండ చిత్రపురి కాలనీలో అనుమతి లేని భవనాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను పడగొట్టారు. 220 విల్లాలకు అనుమతి పొందిన చిత్రపురి సొసైటీ సభ్యులు.. 7 విల్లాలను అక్రమంగా నిర్మించారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య 7 విల్లాలను కూల్చేశారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై అధికారులు చర్యలు చేపట్టారు. మణికొండ చిత్రపురి కాలనీలో 300, 400 గజాలతో భారీ విల్లాలు నిర్మించారు. ఒక్కో విల్లా రెండున్నర నుంచి 4 కోట్ల వరకు విలువ చేస్తుందని అధికారుల అంచనా. చిత్రపురి సొసైటీ సభ్యులు 220 విల్లాల నిర్మాణాలకు అనుమతి పొందారు. అయితే, అక్రమంగా మరో 7 విల్లాలు నిర్మించారు.
దీనిపై ఇప్పటికే మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. అయితే వారు స్పందించకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. భారీ యంత్రాల సాయంతో అక్రమంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేశారు. సొసైటీ సభ్యులు, కూల్చివేతలకు వచ్చిన అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు అధికారులు.
మొత్తం 220 విల్లాలకు చిత్రపురి సొసైటీ సభ్యులు పర్మిషన్ తీసుకున్నారు. కానీ, అక్రమంగా మరో 7 విల్లాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పుడు లేఔట్లలో వస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేశారు. లేఔట్లలో పార్క్ స్థలం లేదా ఇతర స్థలంగా మొదటి చూపించి.. తర్వాత అధికారులకు తెలియకుండా వాటిని ఇంకోలా నిర్మించడం చట్ట విరుద్ధం. లేఔట్లలో పర్మిషన్ తీసుకున్న వాటినే నిర్మించాలి. అంతకుమించి నిర్మాణాలు చేస్తే చట్ట విరుద్ధం అవుతుంది. అధికారులు చర్యలు తీసుకోవడానికి హక్కు ఉంటుంది.
Also Read : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు
విల్లాలలో పెద్ద పెద్ద వాళ్లు నివాసం ఉంటారు. కోట్ల రూపాయలతో వాటిని నిర్మిస్తారు. అలాంటి విల్లాలను కూల్చేయడం సంచలనంగా మారిందని చెప్పాలి. తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ముందుగానే నోటీసులు ఇచ్చామని , చట్టం ప్రకారమే తాము అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.