HCU Students Cases : హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు.. డీజీపీకి డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..

హెచ్ సీయూ లో నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

HCU Students Cases : హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు.. డీజీపీకి డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..

Updated On : April 7, 2025 / 7:47 PM IST

HCU Students Cases : హెచ్ సీ యూ భూ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్ సీయూ విద్యార్థులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని భట్టి ఆదేశించారు. కస్టడీలో ఉన్న ఇద్దరిపై కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. కేసుల ఉపసంహరణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా న్యాయశాఖ పోలీసులకు సూచనలు అందించాలని చెప్పారు.

మంత్రుల కమిటీతో భేటీ అయిన హెచ్ సీయూ టీచర్స్ అసోసియేషన్, ప్రజా సంఘాలు స్టూడెంట్స్ పై కేసులు ఎత్తివేయాలని కోరారు. హెచ్ సీయూ లో నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రుల కమిటీ కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలతో కొందరు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు విద్యార్థులు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. హెచ్ సీయూ వివాదంపై మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. మూడు రోజులుగా ఇదే అంశంపై ఆమె ఫోకస్ పెట్టారు.

తొలి రోజున మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. రెండో రోజున యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలతో భేటీ అయ్యారు మీనాక్షి. హెచ్ సీయూ సమీపంలోని 400 ఎకరాల భూములకు సంబంధించి వివాదం రాజుకుంది. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను తెలంగాణకు పంపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది.

Also Read : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..! ఆ రోజు నుంచి నిలిచిపోనున్న బస్సులు..! కార్మికుల డిమాండ్స్ ఇవే..

ఇవాళ మూడో రోజు సచివాలయంలో మరోసారి మంత్రుల కమిటీతో మీనాక్షి భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో భేటీ అయిన మీనాక్షి.. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలపై పూర్తిగా ఆరా తీశారు. అటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, హెచ్ సీయూ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. యూనివర్సిటీలోని పరిణామాలతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల బృందం దృష్టికి తెచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేస్తున్నట్లు ప్రకటన కూడా చేశారు.