ఎవరి గురించి నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు.. మీ మధ్యలోకి ప్రజా ప్రతినిధులను లాగొద్దు : భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka :ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Deputy CM Bhatti Vikramarka
- నేను ఆస్తుల కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.
- టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ
- బొగ్గు గనుల వ్యవహారంలో తనపై వచ్చిన కథనాలు అవాస్తవం
- వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దు
- ఇప్పుడున్న టెండర్‌ను కాన్సిల్ చేయాలని చెప్పాను
- కొత్తగా మళ్ళీ టెండర్లు మొదలు పెట్టాలని ఆదేశించా
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణలో బొగ్గు గనుల వ్యవహారంలో తనపై ఓ పత్రికలో తప్పుడు కథనాలు రాశారని, ఆ కథనం అవాస్తవమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనం విషయంలో వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ బాధ్యతలో ఉన్నంత వరకు ఏ గద్దలను రానివ్వను. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు. మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు అని భట్టి విక్రమార్క సూచించారు.
ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చానని భట్టి విక్రమార్క అన్నారు. తప్పుడు కథనాలకు నేను భయపడేది లేదని చెప్పారు.
సింగరేణి, తెలంగాణ ఆస్తులను దోపిడీదారుల నుంచి కాపాడుతాం. ఆత్మగౌరవం కోసం మేము బతుకుతాం. సీఎం, మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తామని భట్టి విక్రమార్క అన్నారు.
సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు, బొగ్గు గనులు ప్రజల ఆత్మ. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ. టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ. ఆ విషయంలో మంత్రి ప్రమేయం ఉండదు. అదేవిధంగా క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి ఫీల్డ్ విజిట్ అనేది పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు పెడతారు. కొందరు ఏ ప్రయోజనాల కోసం కట్టు కథలు రాస్తున్నారో తెలుసుకుంటాం. ఇప్పుడు ఉన్న టెండర్‌ను కాన్సిల్ చేయాలని చెప్పాను. కొత్తగా మళ్లీ టెండర్లు మొదలు పెట్టాలని ఆదేశించాను. ఒక అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి.. కొత్తగా టెండర్ వేయాలని చెప్పానని భట్టి విక్రమార్క తెలిపారు.
