Telangana Cabinet : తెలంగాణ చరిత్రలో తొలిసారి.. వనదేవతల సన్నిధిలో తెలంగాణ మంత్రివర్గ భేటీ.. ప్రత్యేక ఏర్పాట్లు.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
Telangana Cabinet : వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Telangana Cabinet
Telangana Cabinet : తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ మేడారంలో కొలువుదీరనుంది. రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం ఇదే మొదటి సారి. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Also Read : మాటమీదుంటాం.. మాటతప్పితే రాజీనామా చేస్తామంటున్న ఎమ్మెల్యేలు
ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మేడారంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసి ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో వారికి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 5గంటల నుంచి 6.30 గంటల వరకు హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. మంత్రివర్గ భేటీ అనంతరం హరిత హోటల్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు బస చేయనున్నారు. హరిత హోటల్ తోపాటు ఇతర ప్రాంతాల్లో మొత్తం 300 మంది బస చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హరిత హోటల్లో 16గదులు, టెంట్ సిటీలో మరో 40 తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. తాడ్వాయి హరిత హోటల్, రిసార్ట్స్, లక్నవరం, రామప్ప, ములుగులోని వసతి గృహాలను ముందస్తుగా అధికారులు బుక్ చేశారు.
మరోవైపు మేడారంలో కేబినెట్ బేటీ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు 1600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ నుంచి వచ్చే వారు ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారంకు వెళ్లాల్సి ఉంటుంది. తాడ్వాయి మీదుగా వాహనాలకు నో ఎంట్రీ. తిరుగుప్రయాణం బయ్యాక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుండెప్పాడ్ మీదుగా వరంగల్ వెళ్లాల్సి ఉంటుంది. సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగడం ఆనవాయితీ. ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో కేబినెట్ కొలువు దీరడం ఒక చారిత్రాత్మక ఘట్టం. పైగా జనవరి 28వ తేదీ నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న క్రమంలో మేడారంలోనే కేబినెట్ మీటింగ్ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేయడంపై ఆసక్తి పెరిగింది.
మేడారం వేదికగా జరిగే కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం లాంటి అనేక అంశాలపై ఈ మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మేడారం అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులు ప్రస్తావనకు రానున్నాయి. మేడారం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ప్రజలకు తెలిసేలా మరిన్ని పనులకు అనుమతించే సూచనలున్నాయి. అంతేకాక.. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది.
