మాటమీదుంటాం.. మాటతప్పితే రాజీనామా చేస్తామంటున్న ఎమ్మెల్యేలు
వచ్చే ఎన్నికల్లోగా యావర్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోతే పోటీ చేయనంటూ సంజయ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
Karimnagar Leaders (Image Credit To Original Source)
- రోడ్డు వేయకపోతే పోటీ చేయనంటున్న ఎమ్మెల్యే సంజయ్
- కొండగట్టు సాక్షిగా మేడిపల్లి సత్యం రాజీనామా సవాల్
- హస్తం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ బీఆర్ఎస్ లీడర్లు
Congress: ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకుంటామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తుంటే..రెండేళ్లు గడిచాయి ఇంకెప్పుడు హమీలు నెరవేరుస్తారంటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
మాట మీదుంటా..మాట తప్పితే రాజకీయాల నుంచి తప్పుకంటానంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల టైమ్‌లో ధర్మపురి నియెజకవర్గానికి బస్ డిపో, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ కాలేజీ తీసుకొస్తానంటూ హమీ ఇచ్చారు.
గెలిచిన ఏడాదిలో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. గెలిచి రెండేళ్లైనా హమీని నిలబెట్టుకోలేకపోయావ్, రాజీనామా ఎప్పుడంటూ వెంటాడుతున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.1 ఇచ్చిన హమీలను నెరవేరుస్తా..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా అంటున్నారు అడ్లూరి.
Also Read: Greater Hyderabad: గ్రేటర్‌లో విభజన చిచ్చు.. జిల్లాల్లో పునర్విభజన లొల్లి
అధికార పార్టీకి దగ్గరగా ఉన్న..జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఓ వైపు ఇంటి పోరుతో సతమతం అవుతున్న సంజయ్‌కి..గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాల్‌గా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు యావర్ రోడ్డు విస్తరణ ఎన్నికల హమీగా మారిపోయింది.
కాంగ్రెస్ నేతల నుంచి కూడా విమర్శలు
వచ్చే ఎన్నికల్లోగా యావర్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోతే పోటీ చేయనంటూ సంజయ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో రోడ్డు విస్తరణ ఎప్పుడంటూ రాజకీయ ప్రత్యర్థులతో పాటు.. కాంగ్రెస్ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవే తనకిక చివరి ఎన్నికలంటూ ప్రతిసారీ ప్రకటిస్తూ మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్న జీవన్‌రెడ్డి సంగతేంతంటూ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు సంజయ్ అనుచరులు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..బీఆర్ఎస్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. కొండగట్టు అభవృద్దికి బీఆర్ఎస్ హయంలో నిధుల కేటాయింపు జరగలేదన్నది సత్యం చేస్తున్న ప్రధాన ఆరోపణ. కేసీఆర్ హయాంలో నిధులను కేటాయించినట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ డీసీసీ ఆఫీస్ వేదికగా ఆయన సవాల్ చేశారు.
సుంకె రవిశంకర్ ఏమన్నారు?
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ఆధారాలు చూపిస్తాం..కొండగట్టు వైజంక్షన్కు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న నేతలు నెరవేర్చని హమీలను..ఒక్క ఛాన్స్ ఇస్తే తాము నెరవేరుస్తామంటూ భరోసా ఇచ్చి గెలిచారు నేతలు.
ఇచ్చిన హమీలపై నమ్మకం కల్పించేందుకు రాజీనామా అస్త్రాన్ని వాడారు. కానీ మాట తప్పితే పొలిటికల్ కేరీర్‌పైనే ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇక వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటెషన్ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన హమీలు..నీటి మూటలే కాబోతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు..సవాళ్లు..ప్రతి సవాళ్లతో ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
