అక్టోబర్ 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభం

Dharani portal launch: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసే కార్యక్రమం ధరణి పోర్టల్ ఈ నెల(అక్టోబర్) 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా.. దసరాకు రెండు రోజులు సమయం మాత్రమే ఉండడం.. ఇంతవరకు ప్రజల ఆస్తుల నమోదు కార్యక్రమం పూర్తిగా సిద్ధం కాకపోవడం.. దానికి తోడు అకాల వర్షాలు కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో వరదలు రావడంతో.. ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది.
ఈ క్రమంలోనే దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలనే నిర్ణయం కాస్త లేటయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణీ పోర్టల్లో నమోదు చేసుకున్న ఆస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సెప్టెంబరు 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కారు. ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ గ్రామ స్థాయిలోనే ఎక్కువగా జరిగినా, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో మాత్రం పూర్తి కాలేదు. GHMC పరిధిలో 20 శాతం మాత్రమే ఆస్తుల నమోదు జరగడంతో.. మిగిలినవి . ఇక ధరణి పోర్టల్ కోసం రిజిస్ట్రేషన్ లు ఆపడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమ్మకాలు కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కూడా నిలిచిపోయింది. ఇల్లు, ఇళ్ల స్థలాలు అపార్ట్ మెంట్‌లలో ప్లాట్లు కొనుగోళ్లు.. రిజిస్ట్రేషన్‌లు చేయించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని శాసన సభలో, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్‌కు పంపడంతో ఆమోదముద్ర పడింది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.