Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నికలో కొత్త ఓటర్ల నమోదులో రాజకీయ దుమారం .. కోర్టుకెక్కిన బీజేపీ

మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో కొత్తగా 23 వేల కొత్త ఓట్లర్లు రిజిస్టర్ కావటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై.. బీజేపీ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. కొత్తగా నమోదైన ఓట్లలో.. మెజారిటీ నకిలీ ఓట్లు ఉన్నాయని పాత ఓటర్ల లిస్టు ప్రకారమే ఎన్నిక నిర్వహించాలని కోరుతూ కోర్టు మెట్లెక్కింది బీజేపీ.

Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నికలో కొత్త ఓటర్ల నమోదులో రాజకీయ దుమారం .. కోర్టుకెక్కిన బీజేపీ

Munugode By Poll New voters

Updated On : October 12, 2022 / 11:43 AM IST

Munugode By Poll : విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అటుంచితే.. మునుగోడులో ఇంకా చాలానే జరుగుతున్నాయ్. ప్రధానంగా.. కొత్త ఓటర్లపై రాజకీయ దుమారం రేగింది. ఈ విషయంలో.. బీజేపీ నేతలు కోర్టు మెట్లెక్కారు. ఇక.. వామపక్షాలు కూడా టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే విషయంలో మీటింగ్ కూడా పెట్టుకున్నాయ్. దీంతో.. లెఫ్ట్ పార్టీలు మునుగోడునే టర్నింగ్ పాయింట్‌గా మార్చుకోవాలని చూస్తున్నాయా? అనే చర్చ కూడా మొదలైంది.

ఎక్కడైనా ఉపఎన్నిక వస్తుందంటే.. కొత్త ఓటర్ల నమోదవడం సాధారణమే. కానీ.. మునుగోడులో ఏకంగా 23 వేల కొత్త ఓట్లర్లు రిజిస్టర్ అవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై.. బీజేపీ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. కొత్తగా నమోదైన ఓట్లలో.. మెజారిటీ నకిలీ ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కంటే ముందున్న ఓటర్ లిస్ట్ ప్రకారమే.. మునుగోడు ఉపఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది కమలదళం. దీంతో.. ఈ అంశంపైనా రాజకీయ రగడ కొనసాగుతోంది. కొత్తగా నమోదైన ఓట్లలో యువ ఓటర్లే ఎక్కువగా ఉన్నారని మిగతా పార్టీల నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ.. బీజేపీ ఈ విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

నిజానికి.. 23 వేల కొత్త ఓట్లు.. అంత చిన్న విషయమేమీ కాదు. అభ్యర్థి గెలుపోటములను డిసైడ్ చేసే నెంబరే అది. అందువల్ల.. కొత్త ఓటర్లు, ముఖ్యంగా యువ ఓటర్ల మూడ్ ఎలా ఉంటుంది? బైపోల్ విషయంలో.. వాళ్లు ఎటు వైపు మొగ్గుతారు? ఏం జరగబోతోందన్న దానిపై.. రకరకాల అంచనాలున్నాయి. పైగా.. వాళ్లంతా ఎవరికి ఓటేస్తారన్నది కూడా కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్ నాటికి వాళ్ల మూడ్‌ ఎలా మారుతోంది.. ఏ పార్టీ చెప్పలేదు. కొత్త ఓటర్లతో.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది. కానీ.. ఇది ఏ పార్టీ అభ్యర్థికి మేలు చేస్తుందన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ అంశంపై.. బీజేపీ హైకోర్టును ఆశ్రయించడం, పాత ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.

మునుగోడు ఉపఎన్నిక కోసం.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ గ్రౌండ్‌లోకి దించింది. సీఎం కేసీఆర్ కూడా ఓ బూత్‌కు ఇంచార్జ్‌గా ఉన్నారంటేనే.. ఈ బైపోల్‌ను గులాబీ పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుందన్న విషయం అర్థమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. సీఎం కేసీఆర్ ఓ బూత్‌కు ఇంచార్జ్‌గా ఉండటం.. అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు.. టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే విషయంలో వామపక్ష పార్టీలు మునుగోడులో సభ పెట్టి మరీ తీర్మానించాయి. అయితే.. దీని వెనుక బలమైన రాజకీయ కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.

Munugode By Poll : కోమటిరెడ్డి టార్గెట్‌గా.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారాస్త్రంగా మారిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్..

వాస్తవానికి.. ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా.. వామపక్ష పార్టీల ప్రస్తావన అంతగా వచ్చేది కాదు. మిగతా పార్టీల మీద ఉన్న ఫోకస్.. లెఫ్ట్ పార్టీల మీద కనిపించేది కాదు. కానీ.. మునుగోడు బైపోల్‌కు వచ్చేసరికి.. పార్టీలదే కాదు పబ్లిక్ అటెన్షన్ కూడా వామపక్షాల మీదకు మళ్లింది. అక్కడ.. కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉండటమే దీనికి కారణం. అందువల్ల.. కామ్రేడ్లు అంతా మునుగోడునే టర్నింగ్ పాయింట్‌గా మార్చుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి.. రాష్ట్రంలో ఎంతో కొంత బలపడాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం.. మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చి.. గులాబీ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే వేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో బలపడేందుకే.. టీఆర్ఎస్‌తో జట్టు కట్టాయన్న చర్చ కూడా సాగుతోంది. మునుగోడులో గనక టీఆర్ఎస్ గెలిస్తే.. అది తమ వల్లే అని చెప్పుకునే చాన్స్ వామపక్షాలకు వస్తుంది. ఈ సీటును ఎగ్జాంపుల్‌గా చూపి.. నల్గొండలో పట్టున్న మరికొన్ని స్థానాల్లో గెలిచేందుకు.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే చాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే.. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే.. మునుగోడులో కచ్చితంగా సత్తా చాటాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఏ ఎన్నిక అయినా.. అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. కానీ.. బైపోల్ విషయానికొస్తే.. అది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోతుంది. కానీ.. మునుగోడు ఉపఎన్నిక మాత్రం.. అంతకుమించి అన్న రేంజ్‌లో ఉంది. తెలంగాణలో ఏడాది తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు.. ఈ మునుగోడు బైపోలే.. సెమీ ఫైనల్ అనే టాక్ మొదలైంది. అప్పుడు.. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నది.. ఈ ఉపఎన్నికే నిర్ణయిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ బైపోల్ మునుగోడు వరకే పరిమితమైనప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దీని గురించి చర్చ జరుగుతోంది. ప్రజల్లోనూ.. ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అందువల్ల.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ మాత్రం నడుస్తోంది. గెలుపు కోసం.. ఏమాత్రం తగ్గకుండా అంతా పోరాడుతున్నారు.