Doctor Harshavardhan : గుండెలు పిండే విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న డా.హర్షవర్ధన్ ట్రాజెడీ స్టోరీ
Doctor Harshavardhan:ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసినా కుంగిపోలేదు. చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు.

Doctor Harshavardhan
Doctor Harshavardhan : తానిక ఎక్కువ రోజులు బతకనని అతడికి ముందే తెలిసిపోయింది. అయినా, అతడు కుంగిపోలేదు. అధైర్యపడలేదు. నిజాన్ని నిర్భయంగా అంగీకరించాడు. చావుని ముందే ఊహించిన అతడు భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ముందస్తు ఏర్పాట్లతో మృత్యువుని సంతోషంగా ఆహ్వానించాడు. ఇదీ.. డాక్టర్ హర్షవర్ధన్ ట్రాజెడీ స్టోరీ. ఆయన గాథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
తానిక బతకనని తెలిసి కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులను ఓదార్చాడు. వారికి ధైర్యం చెప్పాడు. బంధువులు, స్నేహితులతో చివరి క్షణాలను ఆనందంగా గడిపాడు. అంతేకాదు.. అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసి.. తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.
ఖమ్మంకి చెందిన హర్షవర్దన్.. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదివాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే, డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ మరణించాడు. ఎక్కడ ఖమ్మం, ఎక్కడ ఆస్ట్రేలియా. తన అంతిమ సంస్కారాలు సొంత గడ్డపై జరగాలన్నది అతడి చివరి కోరిక. అనుకున్నట్లే అన్నీ ఖమ్మంలో జరిగేలా ఏర్పాట్లు చేసుకుని చివరి కోరిక తీర్చుకున్నాడు. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసినా అతడు కుంగిపోలేదు. చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు.
చేతికి అందివచ్చిన కన్నకొడుకు ఇక బతకడని తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులను ఓదార్చాడు. కుంగిపోతున్న కుటుంబసభ్యులకూ ధైర్యం చెప్పాడు. చివరికి విదేశాల్లో తనువు చాలించి అందరినీ విషాదంలోకి నెట్టాడు. ముందుగానే తన మరణాన్ని పసిగట్టి.. స్వదేశంపై ఉన్న మమకారాన్ని చంపుకోలేక, తన మృతదేహం భారత్ కు చేరేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాడు. సొంత ఊరిలో తన ఆత్మ అనంతవాయువుల్లో కలిసేలా చేసుకున్నాడు.(Doctor Harshavardhan)
ఖమ్మం శ్రీనివాస్ నగర్ కి చెందిన యేపూరి రామారావు, ప్రమీల దంపతుల పెద్ద కుమారుడు హర్షవర్దన్(33) బీ-ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్ లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా చేరాడు.
2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వీసా వచ్చాక భార్యను తీసుకెళ్తానని చెప్పి.. అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. 2020 అక్టోబర్ లో వ్యాయామం చేస్తూ దగ్గు, ఆయాసంతో బాధపడ్డాడు. వెంటనే మెడికల్ టెస్టలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్‌లో షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు.. ఇంటికి తిరిగి రావాలని హర్షవర్దన్ ను కోరారు. అయితే, వారికి ధైర్యం చెప్పిన హర్షవర్దన్ ఆస్ట్రేలియాలోనే మంచి చికిత్స దొరుకుతుందని, కంగారు పడొద్దని నచ్చచెప్పాడు.
Also Read..Restaurant : ఫోన్ చూస్తూ తినొద్దు, త్వరగా తిని వెళ్లిపొవాలి : రెస్టారెంట్ యజమాని కండిషన్
క్యాన్సర్ ముదరడంతో ఇక చావు తప్పదని తెలిసిన హర్షవర్దన్.. ముందుగా భార్యకు విడాకులిచ్చాడు. మరో పెళ్లి చేసుకోమన్నాడు. జీవితంలో ఆమె స్థిరపడేందుకు సాయమూ చేశాడు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకోగా.. వ్యాధి నయమైనట్టు డాక్టర్లు చెప్పడంతో బతుకుతానని సంతోషించాడు. 2022 సెప్టెంబర్ లో ఖమ్మం వచ్చాడు. 15 రోజులు ఆనందంగా గడిపి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే, లంగ్ క్యాన్సర్ తిరగబెట్టింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగదని, మరణం తప్పదని డాక్టర్లు నిర్ధారించారు.
ఇక మిగిలింది కొన్ని రోజులేనని డాక్టర్లు తేల్చేసినా.. హర్షవర్ధన్ ఆందోళన చెందలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తల్లిదండ్రులు జీవితమంతా సుఖంగా బతికేలా ఏర్పాట్లు చేశాడు. ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 24న హర్షవర్దన్ మృతి చెందాడు. ముందుగా ఏర్పాట్లు చేసుకోవడంతో బుధవారం ఉదయం ఖమ్మంలోని హర్షవర్ధన్ ఇంటికి అతని మృతదేహం చేరుకుంది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. హర్షవర్దన్ ట్రాజెడీ స్టోరీ.. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.