Earthquake : మళ్లీ భూకంపం వస్తే పరిస్థితి ఏంటి? భయాందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు..

పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే బెటర్ అని..

Earthquake : మళ్లీ భూకంపం వస్తే పరిస్థితి ఏంటి? భయాందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు..

Updated On : December 4, 2024 / 8:10 PM IST

Earthquake : తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయి. భూప్రకంపనలు మళ్లీ వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. ఓ భారీ భూకంపం వచ్చాక అక్కడే మళ్లీ వస్తే.. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రకంపనలు వస్తూనే ఉంటాయని పలు సమయాల్లో రుజువైంది. దీంతో మన దగ్గర మళ్లీ భూప్రకంపనలు వస్తాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.

వచ్చే కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతంతో పోలిస్తే ఈ ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే బెటర్ అని.. లేకుంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ హెచ్చరించారు.

భూకంపం ప్రధానంగా రెండు కారణాలతో సంభవిస్తుందని.. వాటిలో మొదటిది అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, ఇక రెండోది.. భారీ ఉల్కలు భూమిని తాకినప్పుడు. అయితే, చాలా భూకంపాలకు భూమి లోపలి పలకల్లో వస్తున్న కదలికలే కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ ఉపరితలంపై దాదాపు 20 రకాల పలకలు ఉన్నాయి. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అలా కదిలినప్పుడు వీటి నుంచి వచ్చే ఒత్తిడితో భూఉపరితలం ముక్కలవుతుంది. అలా జరిగే ప్రక్రియే భూకంపం. భూమి ముక్కలైనప్పుడు లోపలి నుంచి వచ్చిన ఒత్తిడి తరంగాల రూపంలో బయటకు పోతుంది. ఆ సమయంలో భారీగా ప్రకంపనలు జరుగుతాయి. నిజానికి ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు.

ఏదో ఒక సమయంలో ప్రకపంనలు రావడం సహజం. భూమి లోపల నిరంతరం కదలికలు వస్తూనే ఉంటాయి. అందువల్ల భూకంపం వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కచ్చితంగా తెలిసి ఉండాలి. అలా తెలియాలంటే భూకంపంపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ ప్రదేశాల్లో భూప్రకంపనలు వచ్చినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు తక్కువ. అదే ఇళ్లు, భవనాలు ఉన్న చోట వస్తే.. అవి కూలిపోవడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, సునామీలు, మంచు తుపానులు, కొండ రాళ్లు విరిగి పడినప్పుడు ప్రాణ హాని మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూప్రకంపనలు వస్తే.. విశాలమైన ప్రదేశాలకు ప్రజలు వెళ్లాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Also Read : ఇక నుంచి నిఘా నీడలో కాకినాడ పోర్టు.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత?