KCR: జూబ్లీహిల్స్ లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం, అదే ప్రధాన అజెండాగా ప్రచారం చేయాలి- కేసీఆర్ దిశానిర్దేశం
డివిజన్ల వారీగా ప్రచారం, జనం స్పందనపై కేసీఆర్ ఆరా తీశారు. బాధను దిగమింగి ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సూచించారు.

KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు పార్టీ అధినేత కేసీఆర్. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ బైపోల్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, ఇదే అంశం ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఇక డివిజన్ల వారీగా ప్రచారం, జనం స్పందనపై కేసీఆర్ ఆరా తీశారు. బాధను దిగమింగి ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సూచించారు కేసీఆర్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం అయ్యారు. ఉప ఎన్నికల్లో విజయానికి కావాల్సిన దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రెండు అంశాలను కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. అలాగే రెండేళ్ల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.
రెండేళ్ల కాంగ్రెస్ దుష్ట పాలనతో ప్రజలు విసిగిపోయారని కేసీఆర్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను సైతం కేసీఆర్ టార్గెట్ చేసిన
పరిస్థితి ఉంది.
ఒక రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని కేసీఆర్ కామెంట్ చేసినట్లు సమాచారం. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయంపై కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారీ మెజారిటీతో మనం గెలవబోతున్నాం అని పార్టీ నాయకులకు కేసీఆర్ ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది.