KCR: కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.

KCR: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ఎత్తి చూపుతూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై గులాబీ పార్టీ ఆందోళన చెందుతోంది. కమిషన్ నివేదికలోని అంశాలపై సీరియస్ గా దృష్టి పెట్టిన కేసీఆర్.. తదుపరి పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.
కాళేశ్వరం నివేదిక అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే చర్యలకు అనుగుణంగా న్యాయ పోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ లో సీరియస్ గా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కార్ చర్యలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాలు ఏంటి? దాని ఆధారంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే ఏం చేయాలి? అన్నదానిపై చర్చించారు. కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించినట్లు అయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలి అనేదానిపై పార్టీ నేతలతో గులాబీ బాస్ డిస్కస్ చేశారు.
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అధికారుల తీరును కాళేశ్వరం కమిషన్ నివేదికలో తప్పుపట్టినట్లు తెలుస్తోంది. మూడు బ్యారేజీల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సరైన ప్లానింగ్ లేదని, డిజైన్ లోనూ లోపాలు ఉన్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్ దే బాధ్యత అని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణం నుంచి కాంట్రాక్ట్ ల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కమిషన్ తేల్చింది. ప్రాజెక్ట్ లో ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం చేసుకున్నారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. క్యాబినెట్ లో చర్చించకుండానే ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపారని కమిషన్ చెప్పింది. అటు డీపీఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్ట్ ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని కమిషన్ పేర్కొంది.