Harish Rao: బండి సంజయ్ కుమారుడి కేసుపై సిట్.. సీఎం రేవంత్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
బాధితులు ఫిర్యాదు చేసినా బండి భగీరథ్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సీఎం రేవంత్, బండి సంజయ్ కుమ్మక్కు రాజకీయం బయటపడింది.
Harish Rao: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో దర్యాఫ్తు కోసం సిట్ ఏర్పాటునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. సిట్ వేయడమంటే భగీరథ్ కేసును నీరుగార్చడమే అని అర్థం అన్నారాయన. తమ పార్టీ నేతలు క్రిషాంక్, నల్లబాలు రిట్వీట్ చేస్తేనే అర్ధరాత్రి ఎత్తుకెళ్లారని ఆరోపించారు. అలాంటిది బాధితురాలు రేప్ కేసు పెట్టి నాలుగు రోజులైంది, ఇప్పటివరకు భగీరథ్ అరెస్ట్ లేదు ఎందుకు? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు.
సీఎం రేవంత్ ఇప్పటివరకు 10 సిట్ లు వేశారని, ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీశ్ వ్యాఖ్యానించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్ రెడ్డికి అలవాటు అని విమర్శించారు. అసలు విషయాన్ని పక్కకు నెట్టే లీక్ మాస్టర్ రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.
”బండి భగీరథ్ కేసును నీరుగార్చేందుకే సిట్. బాధితులు ఫిర్యాదు చేసినా బండి భగీరథ్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? నాలుగు రోజులు అవుతున్నా పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు? సీఎం రేవంత్, బండి సంజయ్ కుమ్మక్కు రాజకీయం బయటపడింది. అసలు సిట్ ఎందుకు? ఫిర్యాదు ఉంది కదా. ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ తో కుమ్మక్కై సిట్ వేశారు రేవంత్. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రేప్ కేసులో నాలుగు రోజులైనా అరెస్ట్ చేయలేదు అంటే రేవంత్ కుమ్మక్కు రాజకీయం బయటపడుతోంది” అని విరుచుకుపడ్డారు హరీశ్ రావు.
Also Read: సర్కార్ కీలక నిర్ణయం.. ప్రైవేటు వెంచర్లలోనూ పేదలకు సొంతిల్లు.. త్వరలోనే అమలు
