2001లోనే చంద్రబాబు ప్రయత్నించారు, రూ.150 కోట్లు ఖర్చు పెడితే రూ.700 కోట్ల లాభం వచ్చింది..!- ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సీఎం రేవంత్ పై మండిపడ్డారు.

2001లోనే చంద్రబాబు ప్రయత్నించారు, రూ.150 కోట్లు ఖర్చు పెడితే రూ.700 కోట్ల లాభం వచ్చింది..!- ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

Updated On : December 20, 2024 / 2:07 PM IST

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. అందులో.. అరెస్ట్ చేయాలనే శాడిస్ట్ మెంటాలిటీ మాత్రమే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. గ్లామర్ కోసం ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టలేదని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా ఈ రేస్ చుట్టూ ఎంతో అభివృద్ధి ఉందని గుర్తించామన్నారు. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ హబ్ గా తెలంగాణను మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

ఈ కార్ రేస్ వ్యవహారంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమంటే చర్చకు రారని సీఎ రేవంత్ పై ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించే సత్తా లేదన్నారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని ఎదురుదాడికి దిగారు కేటీఆర్. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమన్నారు. తనపై నమోదైన కేసులో అసలు అవినీతే లేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సీఎం రేవంత్ పై మండిపడ్డారు.

నిజానికి ఫార్ములా ఈ కార్ రేస్ తో తెలంగాణకు లాభం జరిగిందని నెల్సన్ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వం కలిసి రూ.150 కోట్లు ఖర్చు పెడితే.. తెలంగాణకు రూ.700 కోట్ల లాభం వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. ఫార్ములా ఈ కార్ రేస్ బేస్ గా ఎలాన్ మస్క్ ను తెలంగాణకు తీసుకురావాలని అనుకున్నామని కేటీఆర్ చెప్పారు. టెస్లాను హైదరాబాద్ లో ఏర్పాటు చేయించాలని ఆలోచించామన్నారు.

”హైదరాబాద్ కు ఫార్ములా ఈ కార్ రేస్ తేవాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. 2001లో ఫార్ములా రేసు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. గతంలో గోపన్ పల్లిలో ఫార్ములా కార్ రేస్ కోసం భూసేకరణ చేశారు. ఫార్ములా రేస్ నిర్వహణకు దేశవ్యాప్తంగా పోటీ ఉంది. ఈ రేస్ కోసం 2022 అక్టోబర్ 25న అగ్రిమెంట్ చేసుకున్నాం. ముంబైలో ఫార్ములా ఈ రేస్ పెట్టాలని గడ్కరీ పట్టుబట్టారు. మా సహకారంతోనే ఫార్ములా ఈ రేస్ జరుగుతోందని కేంద్ర మంత్రులే చెప్పారు. ఫార్ములా ఈ రేసుకు రూ.700 కోట్ల లాభం వచ్చింది. దొంగ కేసులకు భయపడేది లేదు. మేము లీగల్ గా పోరాడతాం. రేవంత్ రెడ్డి నన్ను ఏమీ చేయలేరు. సీఎం రేవంత్ సోదరుల అరాచకాలను బయటపెట్టినందుకే మాపై కుట్రలు చేస్తున్నారు” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

Also Read : పొలిటికల్ జైత్రయాత్రకు కవిత రెడీ..! పోటీ చేసేది అక్కడి నుంచేనా?