Gossip Garage : పొలిటికల్ జైత్రయాత్రకు కవిత రెడీ..! పోటీ చేసేది అక్కడి నుంచేనా?

కవిత ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా.. ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారా అన్న క్లారిటీ రావాలంటే..

Gossip Garage : పొలిటికల్ జైత్రయాత్రకు కవిత రెడీ..! పోటీ చేసేది అక్కడి నుంచేనా?

Updated On : December 18, 2024 / 11:15 PM IST

Gossip Garage : జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ జైత్రయాత్రకు సిద్ధమవుతున్నారా. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.? గులాబీ పార్టీకి జగిత్యాలను కంచుకోటగా మార్చే వ్యూహం మొదలైందా? ఐతే జగిత్యాలలో కవిత పొలిటికల్ యాక్టివిటీ ఎలా ఉండబోతోంది. పార్టీ మారిన సంజయ్‌కి ఎలా కౌంటర్ ఇస్తారు?

జగిత్యాల నుంచి పొలిటికల్‌ జైత్రయాత్ర మొదలు..
ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యారు. లిక్కర్ కేసు ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన కవిత.. దాదాపు రెండు నెలలు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో అడుగు పెట్టలేదు. చాలా రోజుల తర్వాత జగిత్యాల నుంచి పొలిటికల్‌ జైత్రయాత్ర మొదలుపెట్టిన కవితకు పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.

కవిత జగిత్యాల నుంచి రీఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర డిబెట్‌ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో జగిత్యాల నుంచే కవిత పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే గాసిప్ రీసౌండ్ చేస్తోంది.

జగిత్యాల సీటును తిరిగి బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసేందుకు కంకణం..
గత ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఎంపీగా ఉండడంతో.. తన పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. తానే అభ్యర్థి అన్నంత రేంజ్‌లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. తనకు వీర విధేయుడిగా ఉన్న సంజయ్ కుమార్‌ను అలవోకగా గెలిపించారు కవిత.. ఐతే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే సంజయ్ అనూహ్యంగా కాంగ్రెస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో కవిత కష్టం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. నియోజకవర్గ పాలిటిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో జగిత్యాల సీటును తిరిగి బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసేందుకు కంకణం కట్టుకున్నారంట కవిత. అందుకే అక్కడి నుంచే రీ ఎంట్రీ ప్లాన్ చేశారనేది పొలిటికల్‌ టాక్.. ఐతే ఈసారి జగిత్యాల అభ్యర్థిగా కవిత ఉంటారా.. లేదంటే పార్టీ కోసమే ప్రచారం చేస్తారా అనేది బిగ్ డౌట్‌.

జగిత్యాలలో పట్టు సాధిస్తే.. నిజామాబాద్ సెగ్మెంట్ అంతా ప్రభావితం చేయవచ్చనేది బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. పైగా త్వరలోనే నియోజకవర్గాల పర్యటనలకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. మరోవైపు తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేస్తూనే.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కవిత క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారట.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ సీటు కూడా ఉంది. ఇలా నిజామాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం ఉండడంతో వారి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ కవిత ఆలోచన చేస్తున్నారట. మహిళా నేతగా కవిత పోరుబాట పడితే మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారుతాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తిరిగి కవిత యాక్టివ్ అవ్వడంతో బీఆర్ఎస్ క్యాడర్ ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది. అయితే కవిత ఈసారి జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా.. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారా అన్న క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందేనేమో..

Also Read : టాలీవుడ్‌‌ని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందా? కారణం అదేనా?