20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది..!- సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే..

Ktr : రుణమాఫీ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీపై సీఎం రేవంత్ డొల్ల మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనతో సీఎం రేవంత్ బండారం మరోసారి బట్టబయలైందని కేటీఆర్ అన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే.. అనధికారికంగా రుణమాఫీ కాని రైతులు ఇంకా ఎంతమంది ఉంటారో అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : అటు స్టడీ టూర్లు, ఇటు ఆఫీస్ రినోవేషన్లు..! అధికారుల జల్సాలకు కేరాఫ్‌గా బల్దియా..!
రైతు రుణమాఫీ అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చామని సీఎం రేవంత్ చెబుతుండగా.. అందులో వాస్తవం లేదని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. సీఎం రేవంత్ మాయ మాటలు చెబుతున్నారని, మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. రుణమాఫీ అంశంలో ఎప్పటికప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్.
రుణమాఫీ అమలు చేసే వరకు సీఎం రేవంత్ ని వదిలిపెట్టేది లేదంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. వడ్లకు బోనస్ ఇస్తామని బోగస్ మార్చారని మండిపడ్డారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే పూర్తిగా రుణమాఫీ జరగలేదని, దీనిపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసురుతున్నారు.
రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. రైతులు ఆదరిస్తేనే తాము అధికారంలోకి వచ్చామని చెబుతున్నారు.