Hot Sun : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా? ఇంకా ఎన్నిరోజులు ఈ భగభగలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారాయి? ఎందుకు ఎండలు ఇంతలా మండిపోతున్నాయి? పగటి ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి? Hot Sun

Climate Changes In Telugu States (Photo : Google)
Climate Changes In Telugu States : ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఓవైపు మాడు పగిలేలా ఎండలు, మరోవైపు తీవ్రమైన ఉక్కపోత.. దీంతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇవేం ఎండలు రా నాయనా అని నిట్టూరుస్తున్నారు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు. ఏపీ, తెలంగాణ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పోనీలే ఇది సమ్మర్ కదా. అందుకే ఎండలు ఇలా మండిపోతున్నాయి, అడ్జస్ట్ అయిపోదాంలే అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది సమ్మర్ కాదు. వేసవి కాలం అయిపోయింది. అయినా ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీంతో జనం పరేషాన్ అవుతున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారాయి? ఎందుకు ఎండలు ఇంతలా మండిపోతున్నాయి? పగటి ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపై వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. ఎండలు ఈ రేంజ్ లో మండిపోవడానికి కారణం ఏంటో చెప్పారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఆ కారణంగానే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అయితే, నవంబర్ మొదటి వారం నుండి శీతాకాలం ప్రారంభం కానుందని, అప్పటివరకు ఇదే తరహా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొడి వాతావరణం కారణంగానే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి అర్బన్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. అందుకే ఎండ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. అంటే నవంబర్ మొదటి వారం వచ్చే వరకు జనాలకు ఈ ఎండవేడి, ఉక్కపోత బాధలు తప్పేలా లేవు.
”నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొడి వాతావరణం సర్వ సాధారణం. పొడి వాతావరణం, మేఘాలు లేని వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు మార్పులు చోటు చేసుకుంటాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీలుగా ఉండాలి. కానీ 36 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. అక్టోబర్ మొదటి వారం నుంచి రెండో వారం వరకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా తిరోగమిస్తాయి. నవంబర్ మొదటి వారం నుంచి చలికాలం ప్రారంభం అవుతుంది. నైరుతి రుతుపవనాలు తిరోగమించి అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాల ఆగమనం జరుగుతుంది” అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు.