చేప ప్రసాదం పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన ప్రజలు.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాద కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

చేప ప్రసాదం పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన ప్రజలు.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

Updated On : June 8, 2025 / 11:38 AM IST

Fish Prasadam Distribution: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా బాధితుల కోసం కొన్నేళ్లుగా ఈ చేప మందును పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో రద్దీనెలకొంది.

 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. 170 సంవత్సరాల నుండి బత్తిన కుటుంబం లక్షలాదిమందికి చేప ప్రసాదం అందిస్తున్నారు. దూద్ బౌలిలో ప్రారంభమైన చేప ప్రసాదం.. ప్రాముఖ్యతతో నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజుల ముందు నుంచే అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలామంది నమ్మకం. 48 గంటలపాటు నిరంతరాయంగా బత్తిని కుటుంబ సభ్యులతో పాటు ఎన్నో డిపార్ట్ మెంట్లు ఈ చేప ప్రసాదం పంపిణీలో పని చేస్తున్నాయని అన్నారు.

మృగశిర కార్తె సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. చేప ప్రసాదం పంపిణీ వద్ద స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా వారికి పొన్నం అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం, భద్రత, క్యూ లైన్ లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

 

13 కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేపప్రసాదం పంపిణీ చేస్తోంది. ఇక్కడికి వచ్చిన వారి కోసం 42 క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.