Jagga Reddy : మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేసేందుకు నా భార్యకు అవకాశం ఇవ్వండి : జగ్గారెడ్డి

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లేకుంటే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద విన్నవిస్తున్నారు.

Jagga Reddy : మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేసేందుకు నా భార్యకు అవకాశం ఇవ్వండి : జగ్గారెడ్డి

Jagga Reddy

Updated On : March 13, 2024 / 10:08 AM IST

Medak Lok Sabha Constituency : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పద్నాలుగుపైగా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు దృష్టిసారించారు. ఇప్పటికే మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రతిపాదించిన వారికన్నా ఇంకా బలమైన వారెవరైనా ఉన్నారా అనే వివరాలు సేకరించి పంపాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జి దీపా దాస్ మున్షీని ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించేందుకు ఇవాళ గాంధీ భవన్ లో సమావేశాలు నిర్వహించనున్నారు.

Also Read : Bjp South Mission : మిషన్ సౌత్‌.. 400 సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ఏంటి?

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లేకుంటే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద విన్నవిస్తున్నారు. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీగా పోటీచేసేందుకు తన భార్య నిర్మల గౌడ్ కు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదస్ మున్సి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. గతంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎమ్మెల్సీగా పోటీచేసి.. అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాలో ఏకగ్రీవంగా కాకుండా దీటుగా నిలబడ్డారని జగ్గారెడ్డి ఈ సందర్భంగా తెలిపినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మల గౌడ్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

Also Read : CM Revanth Reddy : మహాలక్ష్మి స్వశక్తి మహిళ పథకం ప్రారంభం.. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో పోటీచేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తమకంటే తమకే టికెట్ ఇవ్వాలని ఆశావహులు రాష్ట్ర, కేంద్ర పార్టీ పెద్దల వద్ద తమ వాదనను వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర పార్టీల అధిష్టానాలు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.