Bjp South Mission : మిషన్ సౌత్‌.. 400 సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ఏంటి?

బీజేపీ బలంగా ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మిత్రపక్షాల సాయంతో ఏపీ, తమిళనాడు, కేరళల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని వ్యూహాలను రచిస్తోంది.

Bjp South Mission : మిషన్ సౌత్‌.. 400 సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ఏంటి?

Bjp South Mission

Bjp South Mission : వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవాలన్నది బీజేపీ టార్గెట్‌. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 400 సీట్లు గెలవాలంటే మాటలా.. అందుకే మిషన్‌ సౌత్‌ చేపట్టింది అధికార బీజేపీ. ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలన్నదే బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం.. ఈ టార్గెట్‌ చేరుకోవడానికి రంగంలోకి దిగుతున్నారు ప్రధాని మోదీ. ఐదు రాష్ట్రాల్లో ఐదు రోజుల పర్యటనల ద్వారా వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.

5 రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు వ్యూహం..
టార్గెట్‌ సౌత్‌.. ఐదు రాష్ట్రాల్లోని 132 లోక్‌సభ స్థానాల్లో అత్యధిక సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది బీజేపీ. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని మోదీనే రంగంలోకి దింపుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 400 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యం పెట్టుకున్న బీజేపీ.. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సౌత్‌ ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునే వ్యూహానికి పదునుపెడుతోంది.

కనీసం 80 స్థానాల్లో గెలుపే లక్ష్యం..
దక్షిణ భారత్‌లో మొత్తం 132 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం బీజేపీ బలం 29 స్థానాలే. వచ్చే ఎన్నికల్లో కనీసం 80 స్థానాల్లో గెలవాలన్నది బీజేపీ లక్ష్యం. ఇందుకోసం బీజేపీ బలంగా ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మిత్రపక్షాల సాయంతో ఏపీ, తమిళనాడు, కేరళల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని వ్యూహాలను రచిస్తోంది. గత పదేళ్లుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వచ్చే ఎన్నికల తర్వాత చేపట్టే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే దక్షిణ భారత్‌లో ఓటర్లను ఆకర్షించాలంటే ప్రధాని మోదీ గ్లామర్‌ మాత్రమే ఉపయోగపడుతుందనే ఆలోచనతో.. ఈ నెల 15 నుంచి 19 వరకు వరుసగా ఐదు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పర్యటనలకు ప్లాన్‌ చేసింది.

ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు..
ప్రధాని రెగ్యులర్‌ పర్యటనలకు భిన్నంగా ఈసారి బహిరంగ సభలు ప్లాన్‌ చేసింది బీజేపీ. 5 రోజుల పాటు ఒక్కో రోజు కనీసం రెండు నుంచి మూడు రాష్ట్రాల్లో పర్యటన ఉండేలా ప్రధాని షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసింది ఆ పార్టీ. 15న తమిళనాడులో అడుగుపెట్టడం ద్వారా దక్షిణ భారత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. ఆ రోజు తమిళనాడులోని సేలంతోపాటు పక్కనే ఉన్న కేరళలోని పాలక్కాడ్‌లో కూడా పర్యటిస్తారు ప్రధాని. అదేవిధంగా 16న తమిళనాడులోని కన్యాకుమారి, ఏపీలోని విశాఖపట్నం, తెలంగాణలోని జహీరాబాద్‌లో పర్యటిస్తారు. అంటే ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా మూడు రాష్ట్రాల్లోనూ తన పర్యటనపై చర్చ జరిగేలా ప్లాన్‌ చేశారు ప్రధాని.

పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ఆ ముగ్గురు..
ఇక 17వ తేదీన నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలను ఏర్పాటు చేసింది బీజేపీ. గుంటూరు జిల్లా చిలకలూరిపేటతోపాటు మల్కాజిగిరి, కర్ణాటకలోని షిమోగా, కేరళలోని పథనంథిట్టల్లో పర్యటించనున్నారు ప్రధాని. ఈ నాలుగు సభల్లో రెండు ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు హాజరుకాబోతున్నారు. ఇలా ఈ ముగ్గురు నేతలు పదేళ్ల తర్వాత తొలిసారిగా ఒకే వేదికపై కనిపించబోతున్నారు. టీడీపీ ఎన్‌డీఏ కూటమిలో చేరిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభకు లక్షల్లో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.

ఇక నాలుగో రోజైన 18వ తేదీన బీదర్‌, కోయంబత్తూర్‌, 19న ధార్వాడ, నాగర్‌ కర్నూల్‌ల్లో పీఎం సభలను ఏర్పాటు చేసింది బీజేపీ. 5 రోజులుపాటు నిర్వహించే ఈ సభల ద్వారా దక్షిణ భారత్‌పై ఫుల్‌ ఫోకస్‌ చేయాలని నిర్ణయించింది బీజేపీ. తన టార్గెట్‌కు చేరుకోవడానికి కర్ణాటకలోని ప్రస్తుతం ఉన్న స్థానాలను నిలుపుకోవడంతోపాటు, తెలంగాణలో ప్రస్తుతం బలం నాలుగు నుంచి పదికి పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా ఏపీలో టీడీపీ-జనసేనతో కలిపి తాను స్వయంగా పోటీ చేయనున్న ఆరు స్థానాలను గెలుచుకోవడంతోపాటు తమిళనాడు, కేరళల్లో కూడా ఈసారి ఖాతా తెరవాలని భావిస్తోంది.

కనీసం 30 స్థానాలు గెలిచేందుకు వ్యూహం..
ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 25 మంది సభ్యులు ఉండగా, తెలంగాణలో నలుగురు ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల తర్వాత ఈ 29 స్థానాలతో పాటు ఏపీ తెలంగాణల్లో మిత్రపక్షాలతో కలిసి కనీసం 30 స్థానాలను గెలుచుకోవాలనేది బీజేపీ వ్యూహం. ఇక మిగిలిన స్థానాల్లోనూ సాధ్యమైనన్ని గెలుచుకునేలా.. ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచనతో పావులు కదుపుతోంది బీజేపీ. ప్రధాని మోదీ పర్యటనలు ప్రారంభయ్యే సరికి ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలయ్యే అవకాశం ఉండటంతో.. ప్రధాని సభలను విజయవంతం చేసేలా ఇప్పటి నుంచి ప్లాన్‌ చేస్తోంది కమలదళం.

Also Read : బీజేపీ కోసం పవన్ కల్యాణ్ మరో త్యాగం.. ఎన్ని సీట్లు వదులుకున్నారంటే.. బీజేపీకి దక్కిన స్థానాలు ఎన్నంటే