పెళ్లి చేసుకుంటామంటూ ఎన్ ఆర్ ఐలకు వల…రూ.5 కోట్లు దోచుకున్న ఫ్యామిలీ

పెళ్లి చేసుకుంటామంటూ ఓ కుటుంబం ఎన్ ఆర్ ఐలకు వల వేసి.. నాలుగేళ్లలో రూ.5 కోట్లు దండుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో నివాసముంటున్న మాళవిక, శ్రీనివాస్, ప్రణవ్ ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపారు. పెళ్లి చేసుకుంటామంటూ ఇంటర్ నెట్ వివాహ వేదికలు భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీల్లో వివరాలు ఉంచి స్పందించిన వారితో ఫోన్ లో మాట్లాడుతారు. ముహూర్తాలు సిద్ధం చేసుకొని.. పెళ్లి సమయంలో తమ విలువైన ఆస్తులు వివాదాల్లో ఉన్నాయని, కోర్టు కేసుల ఖర్చులంటూ రూ. లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. ఇలా నాలుగేళ్లలో రూ. 5 కోట్లు స్వాహా చేశారు.
మోసపోయామని గ్రహించిన కొందరు ఎన్ ఆర్ఐలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న ఓ యువకుడు తన వద్ద నుంచి రూ. 3 కోట్లు ఇప్పించుకున్నారంటూ పోలీసులకు వివరించారు. సెంట్రల్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక ఆధారాలు సేకరించగా.. గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన తల్లి, కుమారుడు మాళవిక, ప్రణవ్ గా గుర్తించారు.
అమెరికాలో ఉంటున్న ఓ యువకుడిని మోసం చేసేందుకు మాళవిక తాను ఓ అనాథ శరణాలయం నిర్వాహకురాలిగా మూడేళ్ల క్రితం పరిచయం చేసుకుంది. విదేశాల నుంచి దాతలు, కేంద్ర ప్రభుత్వం నుంచి శరణాలయ నిర్వహణకు రూ. లక్షల్లో నిధులు వస్తున్నాయని, ఏటా రూ. 5 కోట్ల ఆదాయం వస్తుందని వివరించింది. మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదంటే చెప్పింది. దీంతో ఆయన హబ్సిగూడలో ఉంటున్న తన తండ్రికి విషయం వివరించగా.. ఆయన కూడా అంగీకరించాడు.
పెళ్లి చేసుకుంటానని ఆ కుర్రాడు చెప్పిన కొద్దిరోజులకే ముగ్గురు కలిసి మాయాజాలం ప్రదర్శించారు. దాతల నుంచి నిధులు రాలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు అందలేదంటూ రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ. 15 లక్షలు ఇప్పించుకునేవారు. అతనికి అనుమానం రాకుండా తీసుకున్న డబ్బుకు వడ్డీ కూడా చెల్లిస్తానంటూ మాళవిక చెప్పేది. మూడేళ్లలో రూ.3 కోట్లు ఇచ్చానని గ్రహించిన అతను డబ్బులెప్పుడు ఇస్తారంటూ ప్రశ్నంచగా… ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. తన తండ్రికి విషయం చెప్పగా.. అనాథ శరణాలయం కాగితాలపైనే ఉందని తెలుసుకున్నారు.
కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మరో కుర్రాడిని భారత్ మ్యాట్రిమోనీ ద్వారా మాళవిక 8 నెలల క్రితం సంప్రదించింది. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్నామని, తండ్రి ఇటీవలే చనిపోయాడంటూ తెలిపింది. తమ ఆస్తులు వివాదంలో ఉన్నాయని, కేసుల్లో గెలవాలంటే న్యాయవాదులకు రూ.లక్షల్లో ఇవ్వాలని అభ్యర్థించింది. అతడు నమ్మడంతో ఆరు నెలల్లో రూ. 65 లక్షలు కొల్లగొట్టారు. వరుణ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గత నెల 27న మాళవిక, ప్రణవ్ లను అరెస్ట్ చేశారు.