హైదరాబాద్‌లో రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. వారికికూడా కార్డులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ration card applicants
Ration cards: రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. అయితే, హైదరాబాద్ లో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో సాగడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేద వర్గాల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు సిద్ధమయ్యారు.
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రజాపాలనలో, మీసేవ ద్వారా వీరంతా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, పౌరసరఫరాల శాఖ ఇప్పటికే విచారణ పూర్తిచేసి కొందరికి కార్డులు మంజూరు చేయగా.. మరికొందరికి తిరస్కరించింది. ఇంకొన్ని దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది.
ఈ నెల 24వ తేదీ వరకు మంజూరైన కొత్త కార్డులకు రేషన్ కోటా కేటాయించింది. దశలవారీగా విచారణ చేస్తూ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గత నెలలో ఆన్ లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో పేద కటుంబాలు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిపైనా విచారణ నిర్వహిస్తున్న అధికారులు.. అర్హులకు కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.